సర్కార్‌ దవాఖానాకు మహర్దశ.. 

20 Sep, 2020 03:18 IST|Sakshi

జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టిన ఎంసీఐ

రొటేషన్‌ విధానంలో పీజీ మెడికల్‌ విద్యార్థుల సేవలు

ఈ ఏడాది బ్యాచ్‌ నుంచే షురూ

కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ 

జిల్లా ఆసుపత్రుల్లో వైద్యుల సేవలు మరింత పెంపు

అలాగే స్థానిక జబ్బులపై విద్యార్థులకు అవగాహన

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ఆధ్వర్యంలోని బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ పీజీలో ఎండీ, ఎంఎస్‌ చేసే విద్యార్థులు రెండో ఏడాది నుంచి జిల్లా ఆసుపత్రుల్లో శిక్షణ పొందాలని తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సవరణ) నిబంధనలు–2020’ విడుదల చేసింది. తద్వారా వీరికి క్షేత్రస్థాయి వ్యాధులపై అవగాహన వస్తుందని, శిక్షణ కూడా పొందుతారని తెలిపింది. మరోవైపు జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. 100 పడకలకు తక్కువ కాకుండా ఉన్న జిల్లా ఆసుపత్రుల్లో వీరికి శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది పీజీలో చేరిన వారికి వచ్చే సంవత్సరం నుంచి ఈ శిక్షణ అమలుకానుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు పీజీ పూర్తయిన విద్యార్థులు బోధనాసుపత్రుల్లో శిక్షణ పొందుతున్నారు.

జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్‌: ఎండీ లేదా ఎంఎస్‌ చేసే పీజీ మెడికల్‌ విద్యార్థులంతా 3 నెలలకోసారి రొటేషన్‌ పద్ధతిలో జిల్లా ఆసుపత్రుల్లో లేదా జిల్లా ఆరోగ్య వ్యవస్థల్లో పని చేయాలి. వారి కోర్సులో భాగంగా ఇది ఉం టుంది. 3, 4, 5 సెమిస్టర్లలో ఉన్న పీజీ విద్యార్థులు రొటేషన్‌ పద్ధతిలో పనిచేస్తారు. దాన్ని జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్‌(డీఆర్‌పీ) అంటా రు. సదరు విద్యార్థులను జిల్లా రెసిడెంట్లుగా పిలుస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను తెలుసుకోవడం దీని ఉద్దేశాలు. విభిన్నమైన శిక్షణ పొందడం. అలాగే ప్రస్తుతమున్న స్పెషాలిటీ వైద్యులకు తోడుగా పీజీ వైద్య విద్యార్థులతో జిల్లా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కానుంది.

ఇన్‌ పేషెంట్‌.. ఔట్‌పేషెంట్‌ సేవల్లోనూ..
► జిల్లా రెసిడెంట్లుగా వెళ్లిన పీజీ విద్యార్థులు జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ (డీఆర్‌పీసీ) పర్యవేక్షణలో పని చేస్తారు. 
► ఇన్‌ పేషెంట్, ఔట్‌ పేషెంట్, క్యాజువాలిటీ తదితర చోట్ల పనిచేస్తారు. నైట్‌ డ్యూటీలూ చేయాలి. 
► అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్‌ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీకి చెందిన పీజీ మెడికల్‌ విద్యార్థులు జిల్లా ఆరోగ్య అధికారి లేదా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. లేబొరేటరీ, ఫార్మసీ, ఫోరెన్సిక్‌ విద్యార్థులు సాధారణ క్లినికల్‌ విధుల్లో పనిచేస్తారు.
► జిల్లా రెసిడెంట్లకు స్టైఫెండ్‌ ఇస్తారు. వారానికో సెలవుతోపాటు ఇతర సెలవులు ఉంటాయి.
► రాష్ట్రస్థాయిలోనూ స్టీరింగ్‌ కమిటీ ఉంటుంది. వివిధ కేసులపై చర్చలు, సెమినార్లు వంటి వాటిల్లో పాల్గొనేలా చేయాలి. 
► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ జిల్లా రెసిడెంట్ల శిక్షణకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. వారి పనితీరుపై మెడికల్‌ కాలేజీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.
► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాంను సమన్వయం లేదా పర్యవేక్షణ చేసేందుకు ప్రతి మెడికల్‌ కాలేజీ అకడమిక్‌ సెల్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. 
► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమం అమలు మొదలైన ఏడాదికి సంబంధిత మెడికల్‌ కాలేజీ అదనపు పీజీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఎంసీఐ పరిగణనలోకి తీసుకుంటుంది.
► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలి.

మరిన్ని వార్తలు