Hyderabad: వాయు నాణ్యత వెరీ పూర్‌.. హైదరాబాద్‌ను కమ్మేసిన కాలుష్యం 

26 Oct, 2022 02:29 IST|Sakshi

ఈ ఏడాది ఫుల్‌ జోష్‌తో దీపావళి సంబరాలు  

ప్రమాదకర స్థాయిలో క్షీణించిన వాయునాణ్యత 

ఏక్యూఐ 400 పాయింట్లు దాటితే ఆరోగ్యవంతులపైనా ప్రభావం 

సనత్‌నగర్, బంజారాహిల్స్, నాచారం తదితర ప్రాంతాల్లో 400 పాయింట్లు మించి నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి బాణసంచా మోత ఆగింది. వాయు కాలుష్యంపై ప్రజల్లో బెంబేలు మొదలయ్యింది. పలు స్థాయిల్లో కాలుష్య స్థాయిలు పెరిగిపోవడమే ఇందుకు కారణం. రెండేళ్లుగా కోవి డ్‌ మహమ్మారి పరిస్థితుల కారణంగా అంతంతగానే టపాకాయలు కాల్చిన నగర ప్రజలు, కరోనా తగ్గుముఖంతో ఈ ఏడాది ఫుల్‌ జోష్‌తో పండుగ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం మొదలుపెట్టి మంగళవారం తెల్లవారుజాము దాకా పటాకులు పేలాయి.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ని పలు జిల్లాల్లో భారీయెత్తున బాంబులు, ఇతర టపాసుల్ని ప్రజలు కాల్చారు. దీని ప్రభావం వాతావరణంపై పడింది. హైదరాబాద్‌లోని 14 వాయు నాణ్యత పరీక్షా కేంద్రాల్లో చాలాచోట్ల కాలుష్య స్థాయిలు పెరిగినట్టు స్పష్టమౌతోంది. ముఖ్యంగా అత్యంత సూక్ష్మ స్థాయిల్లోని (2.5 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే ధూళి, కాలుష్య కణాలు–పీఎం 2.5) కాలుష్యాలను బట్టి వాయు నాణ్యత సూచీని (ఏక్యూఐ–ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వర్గీకరణ ప్రకారం.. ఏక్యూఐ 400 పాయింట్లపైన ఉంటే వాయునాణ్యత తీవ్రమైన స్థాయిలో తగ్గినట్టుగా భావిస్తారు. ఇది ఆరోగ్యవంతులపై సైతం ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.  

అన్నిచోట్లా అధికంగానే.. 
24 గంటల సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్ల లోపు ఉండాల్సి ఉండగా మంగళవారం మధ్యాహ్నం 12కి సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలలో 99, హైదరాబా ద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ వద్ద 92, జూపార్క్‌ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్‌–2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లు నమోదయ్యాయి. దీపావళి టపాసులతో వాయు నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇక సోమవా రం రాత్రి 10 గంటల సమయంలో అయితే సనత్‌నగర్‌ స్టేషన్‌లో ఏక్యూఐ అత్యధికంగా 759కు చేరుకు ని క్రమంగా మంగళవారం ఉదయం 4 గంటలకు 298కు చేరుకుంది. అమీర్‌పేట, సోమాజిగూడ, గచ్చిబౌలి, జూబ్లీíహిల్స్, బంజారాహిల్స్, రామచంద్రాపురం ప్రాంతాల్లో సోమవారం రాత్రి 500 పాయింట్ల దాకా టచ్‌కాగా, రాత్రి 11 గంటల ప్రాంతంలో నాచారం స్టేషన్‌లో 446 పాయింట్లు  రికార్డయింది. మంగళవారం సాయంత్రానికి చాలాచోట్ల మోస్తరు నుంచి తక్కువస్థాయిలో వాయునాణ్యత రికార్డయింది. కాగా, ఈ ఏడాది దీపావళి సందర్భంగా వాయు, శబ్ద కాలుష్యంపై పీసీబీ అధికారికంగా గణాంకాలు వెల్లడించాల్సి ఉంది. 

దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం 
పొగ, మంచు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు పెరిగి వాయు నాణ్యత స్థాయి తగ్గడం గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుటికీ వానాకాలం కొనసాగడం,  చలి పెరగడం, దీపావళి కాలుష్యం తదితరాలతో గతంలోని అలర్జీలు తిరగబెట్టి తీవ్రమైన జబ్బులుగా మారుతున్నాయి.

అప్పర్‌ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి, ఖఫం పడడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరిగి అలర్జిటిక్‌  బ్రాంకైటిస్, స్వైన్‌ఫ్లూ వంటివి వస్తున్నాయి. అస్తమా ఉన్న వారు, పొగతాగే అలవాటు ఉన్న వారు, టీబీ వచ్చి తగ్గినవారిలో ఆరోగ్య సమస్యలు పెరిగి ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  
– డా. వీవీ రమణప్రసాద్, కన్సల్టింగ్‌ పల్మనాలజిస్ట్, కిమ్స్‌ 

మరిన్ని వార్తలు