వెలుగుల కేళీ..దీపావళి

14 Nov, 2020 08:12 IST|Sakshi

కరీంనగర్‌కల్చరల్‌/విద్యానగర్‌(కరీంనగర్‌): హిందువుల అతి ముఖ్యమైన పర్వదినాల్లో దీపావళి ఒకటి. చీకటి వెలుగుల నిండైన జీవనానికి నిజమైన ప్రతీక లాంటి దీపావళిని ప్రజలు శని, ఆదివారాల్లో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోనున్నారు. ఇంటిల్లిపాది, ముఖ్యంగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొనే సంబరం ఇది. వ్యాపార సముదాయాల వద్ద లక్ష్మీదేవికి పూజలు నిర్వహంచడం ఆనవాయితీ. బాణసంచాలతో చిమ్మ చీకట్లను చెల్లాచెదురు చేసే సంబరం దీపావళి.

దీపం లక్ష్మీ స్వరూపం..
‘జ్యోతి’ని పరబ్రహ్మ స్వరూపంగా అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానదీపం వెలిగించి తద్వారా జగశ్శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీపూజకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సహస్రనామాలతో, అష్టోత్తరాలతో, దండకాలతో, భక్తి ప్రపత్తులతో లక్ష్మిదేవిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి పూజలు చేస్తారు. లక్ష్మీదేవికి పద్మాలయ, పద్మ కమలం, శ్రీః, హరిప్రియ, లోకమాతా, ఇందిరా, మారమా, మంగళదేవతా, భార్గవి, లోకజననీ, క్షీరసాగరకన్యకా అనే పర్యాయ నామాలు ఉన్నాయి. అదే విధంగా అదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి,  ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి అనే రూపాలున్నాయి. 

బాణాసంచా కాల్చడంలో జాగ్రత్తలు..
కోవిడ్‌ దృష్ట్యా సామూహికంగా వేడుకలు జరుపుకోవాలి. శానిటైజర్‌ రాసుకుని టపాసులు పేల్చవద్దు. టపాసులు ఆరు బయటే కాల్చాలి. వీలైతే ఒక బకెట్‌ నీటిని ఉంచుకోవడం మరువద్దు. వీధులు, దారులు వెంబడి ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకోవాలి. బర్నాల్, కాటన్, గొంగడి, ఇసుక వంటివి అందుబాటులో ఉంచాలి. కాకర వొత్తులు, విష్ణుచక్రాలు, భూచక్రాల వంటివి దూరంగా ఉంచి కాల్చడం మంచిది. చైన్‌ టపాకాయలను చేతిలో పట్టుకొని కాల్చవద్దు. ఇంటి ఆవరణలో, మైదానాల్లో మాత్రమే కాల్చాలి. టపాకాయలను పిల్లలతో పెద్దలు దగ్గర ఉండి కాల్పించాలి. టపాకాయలను వెలిగించి గాలిలో తిప్పడం, విసరడం చేయవద్దు.

వ్యాపారులకు ఊరట..
టపాసుల నిషేధం విషయమై బాణాసంచా వ్యాపారులకు ఊరట లభించింది. లైసెన్స్‌లు తీసుకొని దుకాణాలు పెట్టిన వ్యాపారులు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆందోళన చెందారు. బాణాసంచాను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం సవరించింది. నాణ్యత సాధారణంగా ఉన్న టపాసులు, గ్రీక్‌క్రాకర్స్‌ కాల్చేందుకు రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి ఇచ్చింది.

సద్గుణ సంపత్తులకు ప్రతీక..
‘జ్యోతి’ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి సజ్జనత్వానికి సుద్గుణ సంపత్తులకు ప్రతీక. జ్ఞానదీపం వెలిగించి తద్వారా జగశ్శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. దీపారాధన చేసే ఆనవాయితీ వేల సంవత్సరాల నుంచి వస్తోంది. మహాలక్ష్మీ నూనెలో, నీటిలో అశ్వయుజ బహుళ త్రయోదళి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకు నివాసముంటుంది. 
– పవనకృష్ణశర్మ, శ్రీదుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్‌ 

మరిన్ని వార్తలు