దీపావళి సెలవుపై ప్రభుత్వం కీలక ప్రకటన.. పబ్లిక్‌ హాలీడే ఎప్పుడంటే..

20 Oct, 2022 13:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు, ఉద్యోగులకు క్లారిటీ ఇస్తూ దీపావళి పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటక చేసింది. ఈ నెల 24వతేదీన(సోమవారం) సెలవు దినంగా ప్రకటించింది. కాగా, సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

పండితులు కూడా 24వ తేదీనే జరుపుకోవాలని తేల్చి చెబుతున్నారు. పంచాంగాల్లో కూడా ఇదే విషయం పొందుపరిచి ఉందని స్పష్టం చేశారు. నిజానికి ఈనెల 25న మంగళవారం అమావాస్యగా క్యాలెండర్లలో ఉంది. సాధారణంగా ఆశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ నిర్వ హించుకోవటం ఆనవాయితీ. క్యాలెండర్లలో 25వ తేదీనే అమావాస్య ఉండటంతో పండుగ అదే రోజు ఉంటుందన్న భావన జనంలో వ్యక్తమైంది. కానీ, పంచాంగాలు మాత్రం, 25న కాదు, 24వ తేదీనే దీపావళి అని స్పష్టం చేస్తున్నాయి.  

ఇదీ కారణం..
దీపావళిని ప్రదోష వేళ నిర్వహించటం ఆనవాయితీ, అంటే సూర్యాస్తమయ సమయంలో నిర్వహిస్తారు. 25న మంగళవారం అమావాస్య తిథి ఉన్నా.. ప్రదోషవేళ(సూర్యాస్తమయం) వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయి. ఆరోజు సాయంత్రం 4.25 కల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేసింది. సూర్యాస్తమయానికి అమావాస్య లేదు. 24న సోమవారం సాయంత్రం 4.25 సమయానికి అమావాస్య ప్రారంభమవుతోంది.

సూర్యాస్తమయానికి అమావా స్య ఘడియలే ఉన్నందున 24న సాయంత్రాన్ని అమావాస్యగా పరిగణించి అదే రోజు దీపావాళి నిర్వహించుకోవాలని పండితులు పేర్కొంటున్నారు. అదే రోజు ధనలక్ష్మి పూజలు కూడా నిర్వహించాలని పేర్కొంటున్నారు. చాలామందికి దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. సాధారణంగా మధ్యాహ్నం వేళ అమావాస్య ఉన్న సమయంలో కేదారేశ్వర వ్రతం జరుపుతుంటారు.

24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేనందున, మరుసటి రో జు వ్రతం జరుపుకోవాలని, కానీ ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నందున, గ్రహణం విడిచిన తర్వాత గృహ శుద్ధి చేసి సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు పండితులు పేర్కొంటున్నారు. కానీ దీపావళి రోజునే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉన్నందున, అమావాస్య మధ్యాహ్నం లేన్పటికీ 24వ తేదీనే వ్రతం చేసుకోవాలని కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలున్నాయి.

మరిన్ని వార్తలు