సిగరెట్లూ ఎగిరొస్తున్నాయి!

8 Feb, 2021 08:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘అన్నా.. ఏక్‌ గుడాన్‌గరమ్‌’.. ‘ప్యారిస్‌ ఉందా?’ .. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ పేర్లు విదేశీ సిగరెట్లవి. పట్నం నుంచి పల్లె దాకా ఇవిప్పుడు గుప్పుమంటున్నాయి. రూ.20కే ఒక ప్యాకెట్‌ లభించడం, బీడీ కట్ట కంటే తక్కువ ధర కావడంతో పాటు ‘విదేశీ బ్రాండ్‌’ఇమేజ్‌పై మోజుతో యువత, విద్యార్థులు వీటికి బానిసలవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మారుమూల పల్లెల్లోనూ వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిజానికి పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై 85 శాతం హానికరమనే బొమ్మలు ఉండాలి.. భారీగా పన్నులు కూడా చెల్లించాలి. ఇలాంటివన్నీ ఎగ్గొడుతూ కొన్ని ముఠాలు నిషేధిత విదేశీ సిగరెట్లను అడ్డదారిలో తరలిస్తూ తక్కువ ధరకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి.
సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌

తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న సిగరెట్లలో డజరమ్‌ బ్లాక్, గుడాన్‌ గరమ్‌ బ్రాండ్లు ప్రధానమైనవి కాగా, ప్యారిస్, బడిస్కార్‌ వంటి మరో పది వరకు బ్రాండ్లు ఉన్నాయి. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్‌ గల ఇవి వేర్వేరు మార్గాల్లో ఇక్కడకు చేరుతున్నాయి. ఇండోనేషియా తయారీ బ్రాండ్లు దుబాయ్‌ లేదా బంగ్లాదేశ్‌ మీదుగా హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలకు రవాణా అవుతున్నాయి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్‌ బేగంబజార్, అటు కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతాలు విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా స్థావరాలుగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల నుంచీ ఇవి రవాణా అవుతున్నాయి.

మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాలకు హైదరాబాద్‌ నుంచే నేరుగా చేరుతున్నాయి. ఇంకా చైనా, మలేషియా, స్విట్జర్లాండ్, సౌత్‌ కొరియా దేశాల నుంచి కూడా వివిధ మార్గాల్లో విదేశీ సిగరెట్లు హైదరాబాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి విదేశీ బ్రాండ్ల పేరుతో రూ.10, రూ.15, రూ.20కి ఒక్కో సిగరెట్‌ విక్రయిస్తుండగా, కొన్ని బ్రాండ్ల సిగరెట్‌ ప్యాకెట్‌ రూ.20కే అమ్ముతున్నారు. మొదట్లో డైపర్ల పేరుతో సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా చేరిన ఇవి.. ఆ తరువాత ఇంజనీరింగ్‌ వస్తువులు, కంప్యూటర్‌ స్పేర్‌ పార్ట్స్‌ పేరుతో వాయు మార్గాల్లో బంగ్లాదేశ్‌కు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ బెంగాల్‌ ద్వారా 
హైదరాబాద్‌కు చేరుతున్నాయి. 

పన్నులు ఎగ్గొట్టి..
విదేశీ సిగరెట్ల దిగుమతిపై ప్రభుత్వం దిగుమతి సుంకం (కస్టమ్స్‌ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఇదంతా ఎగ్గొట్టడానికే ముఠాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోల్‌సేలర్ల ద్వారా వీటిని మార్కెట్లోకి వదులుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులను ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో, ఎయిర్‌కార్గో కార్యాలయాల నుంచి  తీసుకోవడానికి అనేక క్లియరెన్స్‌లు అవసరం. దీంతో సిగరెట్ల అక్రమ రవాణా ముఠాలు కస్టమ్స్‌ తరఫున పని చేసే ఏజెంట్లు సహా అనేక మందితో మిలాఖత్‌ అవుతూ అవసరమైన క్లియరెన్స్‌ పత్రాలను బోగస్‌వి సృష్టిస్తున్నాయి.

ఆరోగ్యానికి హాని చేస్తాయి..
విదేశీ సిగరెట్లు ఎక్కువసేపు కాలుతున్నాయని, టేస్ట్‌ భిన్నంగా ఉంటోందని అంటున్నారు. వీటిలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది నిర్ధారణ కాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు అనుకూలమో కాదో చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్‌ హెల్త్‌ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. నగరంతో పాటు జిల్లాల్లోని పల్లెల్లో విద్యార్థులు, యువత, కూలీలు విదేశీ సిగరెట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పట్టణాల్లోని కళాశాలలు ఎక్కువగా ఉన్నచోట్ల వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని పాన్‌షాపుల్లో తెలిసిన వారికే వీటిని గుట్టుగా విక్రయిస్తుండగా, చాలాచోట్ల బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయి. కాగా, మెదక్‌ మరికొన్ని జిల్లాల్లో విదేశీ బ్రాండ్‌ పేరుతో లోకల్‌ మాల్‌ను కొందరు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు