నిబంధనలను ఉల్లంఘించినందుకు డీమార్ట్‌కు జరిమానా

22 Dec, 2021 21:14 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని హైద‌ర్‌న‌గ‌ర్లో గల డిమార్ట్ అవుట్ లెట్‌కు క్యారీ బ్యాగుల కోసం వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(సీడీఆర్‌సీ) జరిమానా విధించింది. మే 2019లో 602 రూపాయల విలువైన కొనుగోళ్లు చేసిన తర్వాత క్యారీ బ్యాగ్ కోసం డిమార్ట్ తన నుంచి 3.50 రూపాయలు వసూలు చేసిందని ఆకాశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే నిబందనల ప్ర‌కారం.. క్యారీ బ్యాగుల‌కు డ‌బ్బులు వ‌సూలు చేస్తే.. అలాంటి బ్యాగ్‌ల‌పై కంపెనీకి చెందిన లోగోలు ఉండ‌రాదు. లోగోలు ఉంటే ఆ బ్యాగుల‌ను ఉచితంగానే క‌స్ట‌మ‌ర్ల‌కు అందించాలి. 

అయితే, డిమార్ట్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌కు రూ.3.50 వ‌సూలు చేసింది. ఆకాశ్ కుమార్ పిటిషన్‌ విషయమలో ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న క‌మిష‌న్ ఆకాశ్ కుమార్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యారీ బ్యాగ్‌పై లోగో ఉన్నందున డిమార్ట్ ఆ బ్యాగ్‌ను ఉచితంగానే ఇవ్వాల్సి ఉంద‌ని, కానీ వారు రూ.3.50 వ‌సూలు చేశారు కాబ‌ట్టి ఆ మొత్తాన్ని వినియోగ‌దారుడికి చెల్లించాల‌ని క‌మిష‌న్ తీర్పు ఇచ్చింది. అలాగే ఆకాష్‌కు రూ.1,000 న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని సూచించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల సమయం లోపల చెల్లించకపోతే 18 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొంది. అయితే డిమార్ట్‌కు ఇలా ఫైన్ ప‌డ‌డం ఇదేమీ కొత్త కాదు. గ‌తంలో హైద‌ర్‌గూడ‌లోని అవుట్ లెట్‌కు కూడా ఇలాగే రూ.50వేల జ‌రిమానా విధించారు. 

(చదవండి: రైతులకు ఎస్​బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!)

మరిన్ని వార్తలు