పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్‌

28 Dec, 2022 01:40 IST|Sakshi
శివసేనారెడ్డికి, అభ్యర్థికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేస్తున్న మహేష్‌కుమార్ గౌడ్, మల్లు రవి  

హైదరాబాద్‌: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నియామకపు పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ పోలీసు బోర్డులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సమర దీక్ష నిర్వహించారు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు విచ్చేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు మాట్లాడుతూ బోర్డు నిర్ల క్ష్యం కారణంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌  అభ్య ర్థులు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

శివసేనా రెడ్డి మాట్లాడుతూ... బోర్డు ఇచ్చిన తప్పుడు ప్రశ్నల వల్ల ఏడు మల్టిపుల్‌ ప్రశ్నల మార్కులను అభ్యర్థులకు కలపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పు అమలు చేస్తే దాదాపు 70 వేల మంది అభ్యర్థులకు న్యాయం జరిగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, నేతలు ప్రవళిక నాయక్, శివకుమార్‌ రెడ్డి, వెంకట్, మాతం ప్రదీప్, సునీత, దివ్య పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు