‘రాయలసీమ’కు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు

6 Jul, 2021 03:24 IST|Sakshi

ఆ ప్రాజెక్టుతో పర్యావరణానికి తీవ్ర నష్టం

బోర్డు అనుమతులు పొందే వరకు ప్రాజెక్టుపై ముందుకెళ్లరాదని ఎన్జీటీ ఆదేశించింది

కేంద్రం సైతం సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చేవరకు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశించింది

ఈఏసీ సభ్య కార్యదర్శికి ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పర్యావరణ మదింపు కమిటీ (ఈఏసీ)కి లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమ ప్రాజెక్టని, ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నీటి కేటాయింపులు లేవని, కేంద్ర జల సంఘం అనుమతులు సైతం లేవని దృష్టికి తెచ్చింది. గతంలో కేంద్ర జల సంఘం ద్వారా నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు ఈఏసీ పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేసింది.

సీడబ్ల్యూసీ నీటి కేటాయింపులు జరుపలేదన్న కారణంగానే తెలంగాణ చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం (ఫేజ్‌–1)కు సైతం 2018 అక్టోబర్‌లో పర్యావరణ అనుమతులు వాయిదా వేసిన విషయాన్ని దృష్టికి తెచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ ఈఏసీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు ఇవ్వకూడదో లేఖలో వివరించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను విస్తరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని, ఇది కేంద్ర జల సంఘం ఆమోదించని అక్రమ ప్రాజెక్టని లేఖలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా కృష్ణా జలాలను బేసిన్‌ అవతలకు తరలించేలా ప్రయత్నాలు చేస్తోందని, దీనిద్వారా ఏపీ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని తెలిపింది.

ముఖ్యంగా వన్యప్రాణి కేంద్రాలైన రొలియాపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీలంకమల్లేశ్వర, శ్రీ పెనుసిల నర్సింహ, రాజీవ్‌గాంధీ నేషనల్‌ పార్క్, శ్రీ వెంకటేశ్వర పార్కులు ఈ ప్రాజెక్టు కాల్వలకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయని వెల్లడించారు. వాటి వివరాలను జత చేశారు. ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ కేవలం బఫర్‌ జోన్‌లోంచే కాకుండా కోర్‌ జోన్‌ల ద్వారా వెళుతున్నట్లు ఏపీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని తెలిపారు. దీంతోపాటే జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సైతం రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించి, అనుమతులు పొందేవరకు ముందుకు వెళ్లరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని దృష్టికి తెచ్చారు. వీటితో పాటే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలోనూ ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిందని, తదనంతరం కేంద్ర ప్రభుత్వం సైతం సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చేంతవరకు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని లేఖలో తెలిపారు. ఈ అంశాల దృష్ట్యా పర్యావరణ అనుమతుల మంజూరుకు ముందు న్యాయపరమైన, పర్యావరణ, హైడ్రాలాజికల్‌ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈఎన్‌సీని కోరారు.    

>
మరిన్ని వార్తలు