మునుగోడు బరిలో కేఏ పాల్‌.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే.. 

6 Nov, 2022 21:14 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సూపర్‌ విక్టరీని అందుకుంది. దాదాపు 10వేల ఓట్లకుపైగా ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి.. ఘన విజయం సాధించారు. బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయి మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటారు. 

ఇక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన పాల్‌కు 805 ఓట్లు వచ్చాయి. అయితే, ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్‌ నుంచి రెండు డిజిట్ల సంఖ్యకే పరిమితమైన పాల్‌.. పదమూడో రౌండ్‌లో​ అత్యధికంగా 86 ఓట్లు సాధించారు. ఇక, అత్యల్పంగా 15వ రౌండ్‌(ఆఖరి రౌండ్‌)లో 11 ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు.. ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. అంతా ఫ్రాడ్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ అవినీతిపై బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించడంలేదని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్‌ అభ్యర్థులకు దాదాపు 6వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చని పక్షంలో ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు 482 మంది ఓటు వేశారు. 

ఇది కూడా చదవండి: ‘కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అంత సీన్‌ లేదు’

మరిన్ని వార్తలు