మీరూ కావచ్చు.. ఒక్కరోజు బ్రిటిష్‌ హైకమిషనర్‌! 

14 Sep, 2021 21:22 IST|Sakshi

18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతులకు మాత్రమే.. 

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటిష్‌ హైకమిషనర్‌గా పనిచేయాలని ఉందా?.. అయితే ఒక్క రోజు మాత్రమే. హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ కార్యాలయం ఈ అవకాశం కలి్పస్తూ సోమవారం ప్రకటన జారీ చేసింది. దీనికి 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతులు మాత్రమే అర్హులు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అర్హులైన యువతులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తుదారులు.. ‘యువజనం వాతావరణ మార్పుల్లాంటి సమస్యల పరిష్కారంలో ఏ రకంగా మెరుగైన మద్దతు ఇవ్వగలరు’అన్న అంశంపై నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రా మ్‌లో పోస్ట్‌ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో@UKinIndiaMýకు ట్యాగ్‌ చేయడంతోపాటు # DayoftheGirl హ్యష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలి. 

సెప్టెంబర్‌ 28న విజేత వివరాలు వెల్లడి
‘భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలిక సాధికారతకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. యూకే ప్రభుత్వం ఇచ్చే ఛీవెనింగ్‌ ఫెలోషిప్‌లో 60 శాతం, స్కాలర్‌ షిప్‌ల్లో 52 శాతం మహిళలకు దక్కుతుండటం సంతోషదాయకం. ‘హై కమిషనర్‌ ఫర్‌ ఎ డే’ ద్వారా మహిళలు ఏదైనా సాధించగలరు అన్న అంశాన్ని చాటిచెప్పాలని నిర్ణయించాం’అని భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ ప్రకటనలో తెలిపారు. 2017 నుంచి బ్రిటిష్‌ హై కమిషన్‌ ‘హై కమిషనర్‌ ఫర్‌ ఎ డే’ను నిర్వహిస్తోందని, గత ఏడాది 18 ఏళ్ల చైతన్య వెంకటేశ్వరన్‌ దీనికి ఎంపికయ్యారని వివరించింది. దరఖాస్తుదారులందరి వివరాలను బ్రిటిష్‌ హైకమిషన్‌ నేతృత్వంలోని న్యాయనిర్ణేతలు పరిశీలించి ఒకరిని ఎంపిక చేస్తారని, సెప్టెంబర్‌ 28న విజేత వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తామని తెలిపారు.
చదవండి: సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం

ఒక్కొక్కరు ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే ఆ వ్యక్తిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను వీడియోలో ఉంచరాదని పేర్కొన్నారు. విజేత ఒక రోజుపాటు ఢిల్లీలో బ్రిటిష్‌ హైకమిషనర్‌గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన రవాణా, వసతి ఖర్చులను కమిషన్‌ భరించదు. విజేత ఇతర ప్రాంతాల వారైతే కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఢిల్లీకి రావడం, బస చేయడం పూర్తిగా వారి బాధ్యతేనని ఎల్లిస్‌ స్పష్టం చేశారు.
చదవండి: వైద్యుల తయారీలో అరవై ఏడు వసంతాలు 

మరిన్ని వార్తలు