హృదయ విదారకం: రోగికి ఊపిరి పోస్తుండగా.. ఆగిన డాక్టర్‌ గుండె

29 Nov, 2021 09:54 IST|Sakshi
శనివారం కుటుంబ సభ్యులతో వ్యవసాయ క్షేత్రంలో సరదాగా గడుపుతున్న డాక్టర్‌ లక్ష్మణ్‌

గుండెపోటుకు గురైన రోగికి చికిత్స చేస్తుండగా కుప్పకూలిన డాక్టర్‌

రోగిని వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి

కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన  

సాక్షి, గాంధారి (కామారెడ్డి): గుండెపోటుకు గురైన ఓ రోగికి ఆస్పత్రిలో చికిత్స అందించే క్రమంలో వైద్యుడు సైతం గుండెపోటుకు గురయ్యాడు. వైద్యం అందించేలోగానే తుదిశ్వాస విడిచాడు. దీంతో రోగిని అంబులెన్సులో మరో ఆస్పత్రికి తరలిస్తుండగా అతనూ మార్గమధ్యలోనే కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 

నిమిషాల వ్యవధిలోనే... 
గాంధారి మండలం గుజ్జుల్‌ తండాకు చెందిన కాట్రోత్‌ జగ్గు (60) ఆదివారం ఉదయం గుండెనొప్పితో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధారి మండల కేంద్రంలోని ఎస్‌వీ శ్రీజ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిని నడుపుతున్న డాక్టర్‌ డి. లక్ష్మణ్‌ (45) వెంటనే వైద్య సేవలు మొదలు పెట్టారు. రోగిని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే డాక్టర్‌కు గుండెపోటు వచ్చింది.

ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది వెంటనే సమీపంలో ఉన్న మరో ఆస్పత్రి వైద్యుడిని తీసుకొచ్చి వైద్యం అందించే ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే మరణించారు. అదే సమయంలో రోగి జగ్గును అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అటు డాక్టర్, ఇటు రోగి నిమిషాల వ్యవధిలో మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. 

ముందురోజు సరదాగా గడిపి.. 
మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ డి. లక్ష్మణ్‌ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య స్నేహలత, ఇద్దరు కుమార్తెలు దీక్షణి, దర్శణి ఉన్నారు. ఆరు నెలల క్రితం గాంధారి మండల కేంద్రంలో సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఎం.ఫార్మసీ చదివిన భార్య స్నేహలత ఆస్పత్రిలో మెడికల్‌ షాప్‌ చూసుకుంటున్నారు. ఆయన ఇటీవలే అయ్యప్ప మాల ధరించారు.

శనివారం భార్య, పిల్లలతో స్థానికంగా ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి సరదాగా గడిపి వచ్చిన డాక్టర్‌ ఆదివారం ఉదయమే మేల్కొని చన్నీటితో స్నానం చేసి పూజలు పూర్తి చేసుకున్న సమయంలోనే గుండెపోటుకు గురైన జగ్గును అతని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అతనికి వైద్యం అందించే ప్రయత్నంలో డాక్టర్‌ లక్ష్మణ్‌ చనిపోవడం అందరినీ కలచి వేసింది. డాక్టర్‌ అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. భార్య, పిల్లల రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. 

జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి ఉదయం గుండెపోటు  రావడంతో గాంధారి మండలంలోని ఎస్వీ శ్రీజ మల్లి స్పెషలిస్ట్ ఆసుపత్రికి వారి బంధువులు తీసుకొచ్చారు. పేషేంట్‌కు ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్‌ లక్ష్మణ్‌కు కూడా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పేషేంట్‌కి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా మధ్యమార్గంలో రోగి కూడా మృతి చెందారు. దీంతో గాంధారి మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి.
చదవండి: టెన్త్‌ క్లాస్‌మెట్‌.. పెళ్లి చేసుకుంటానని యువతిని లొంగదీసుకుని..

మరిన్ని వార్తలు