చైన్ కట్‌ చేయకుంటే జూన్‌లో మళ్లీ కరోనా విజృంభణ‌

11 Feb, 2021 08:08 IST|Sakshi
డాక్టర్‌ శ్రీనివాసరావు

వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో ఇలాంటి కేసులు 10 నమోదు 

వ్యాక్సిన్‌ వేసుకున్నామన్న ధీమాతో అజాగ్రత్త 

రెండో డోసు వేసుకున్న రెండు వారాలకే రక్షణ 

వ్యాక్సినేషన్‌ తక్కువ నమోదుపై అధికారుల ఆందోళన 

చైన్‌ను కట్‌ చేయకపోతే జూన్‌ నుంచి వైరస్‌ విజృంభణ 

వ్యాక్సిన్‌ వేసుకున్నాం ఇక మాకేం ఫర్వాలేదన్న ధోరణితో కొందరు కనీస జాగ్రత్తలను గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా టీకా వేసుకున్న వారిలో అక్కడక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణలో వ్యాక్సిన్స్‌ వేసుకున్న వారిలోనూ ఇప్పటిదాకా 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. టీకా రెండు డోసులు వేసుకున్న కొన్ని రోజుల తర్వాతే పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని, అప్పటి వరకు కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు అంటున్నారు. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం తప్పనిసరి స్పష్టం చేస్తున్నారు. కానీ చాలామంది ఇవేమీ పట్టించుకోవడంలేదని, అలాచేస్తే టీకా వేసుకున్నా ప్రయోజనం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా కార్యక్రమం పూర్తయింది. ప్రస్తుతం పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. 13వ తేదీ నుంచి మొదటి డోసు వేసుకున్న వారికి రెండో డోసు టీకా వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి డోసు టీకా తర్వాత వారం పది రోజులకు వైరస్‌ నుంచి కొద్దిపాటి రక్షణ మాత్రమే ఉంటుంది. రెండో డోసు వేసుకున్న రెండు వారాలకు అంటే మొదటి డోసు నుంచి సరిగ్గా 42 రోజుల తర్వాత శరీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీలు తయారవుతాయని, అప్పటినుంచి మాత్రమే కరోనా నుంచి పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. కానీ కొందరు మాత్రం టీకా వేసుకున్న తర్వాత జాగ్రత్తలు పాటించడం లేదని వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది. దీంతో టీకా వేసుకున్నవారిలో పలువురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని గుర్తించారు. 42 రోజుల తర్వాత కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వారి ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెంతే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

వ్యాక్సిన్‌పై చిన్నచూపు... 
కరోనా వైరస్‌ను ఓడించాలంటే వ్యాక్సిన్‌ వేసుకోవడమే అంతిమ పరిష్కారమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా వైరస్‌ రిస్క్‌ ఎక్కువ ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా వేశారు. ఇప్పుడు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వేస్తున్నారు. కానీ ఆయా వర్గాల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంపై వైద్య, ఆరోగ్య వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలా టీకా పట్ల చిన్నచూపు సరైంది కాదని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. అవకాశం ఉన్నవారంతా వ్యాక్సిన్‌ తీసుకుంటేనే వైరస్‌ చైన్‌ తెగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు.  

నిర్లక్ష్యం చేస్తే మరోసారి వైరస్‌ విజృంభణ
ఇప్పటికీ కరోనా వైరస్‌ ప్రమాదం తొలగిపోలేదన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. కాబట్టి ఎప్పటిలాగానే కరోనా జాగ్రత్తలు పాటించాలి. వ్యాక్సిన్‌ వేసుకోకుండా, ఏమీ కాదన్న ధీమాతో నిర్లక్ష్యం చేస్తే మరోసారి వైరస్‌ విజృంభించే ప్రమాదం నెలకొంది. ఇలా నిర్లక్ష్యం చేస్తూ పోతే వైరస్‌లో వచ్చే మార్పుల (మ్యుటేషన్స్‌) వల్ల జూన్‌ నుంచి కరోనా విజృంభించే ప్రమాదం నెలకొందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణ ప్రజలు ఎప్పటిలాగే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. 
– డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు 

>
మరిన్ని వార్తలు