సంతోషంగా ఉండటం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

20 Jun, 2021 14:51 IST|Sakshi

జీవితంలో ఇదే ముఖ్యమంటున్న మానసిక నిపుణులు 

ఆనందంతో మంచి మానవ సంబంధాలు  

ఆరోగ్యానికి, దీర్ఘాయుష్షుకు కూడా కారణమవుతుంది  

లక్ష్యాల సాధనకు దోహదపడుతుంది

సాక్షి, హైదరాబాద్‌: సంతోషం.. మానవ జీవితంలో ఓ ముఖ్యమైన సానుకూల భావన. సంతోషంగా ఉండే వ్యక్తులు మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారు. ఇతరులతో పోల్చుకుంటే వీరికి ఎక్కువగా సామాజిక మద్దతు లభిస్తుంది. అలాగే ఆనందంగా ఉండేవారు తక్కువ ఒత్తిళ్లకు గురవుతారు. అధిక సృజనాత్మకతను, మరింత ఉదారతను కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యంతో ఇతరులతో పోల్చుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారని మానసిక నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అసలు సంతోషంగా ఉన్నామనే భావనే జీవితంలో అనేక ప్రయత్నాలను, చొరవల్ని విజయపథం వైపు నడిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భయం, ఆందోళన, వైరాగ్యం నుంచి బయటపడి సాధ్యమైనంతగా సంతోషంతో జీవించడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. మనుషులపై సంతోషం, సంతృప్తి, అసంతృప్తి వంటి అంశాలు చూపే ప్రభావం, వాటితో ముడిపడిన విషయాలపై సైకియాట్రిస్ట్‌లు డాక్టర్‌ ఎమ్మెస్‌ రెడ్డి, డాక్టర్‌ నిషాంత్‌ వేమన, సీనియర్‌ సైకాలజిస్ట్‌ సి.వీరేందర్‌ల వివరణ వారి మాటల్లోనే...

ఆరోగ్యం, విద్య అత్యంత కీలకం
ఆస్తులున్నా ఆనందంగా ఉండలేరు. అదే సమయంలో ఏమీలేని వారు కూడా ఉన్నదాంట్లోనే సంతోషంగా గడుపుతుంటారు. సంతోషంగా ఉండడానికి ఆరోగ్యం, విద్య అనేవి చాలా ప్రధానమైనవి. నెలకు రూ. కోటి సంపాదించే వారికి, నెలకు రూ.లక్ష సంపాదించే వారికి హ్యాపీనెస్‌లో పెద్దగా తేడాలుండవు. అత్యంత సంపన్నులుగా ఉన్న వారు సైతం ఆరోగ్యం సరిగా లేకపోతే, సరిగా నడవలేకపోతే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే సంతోషంగా ఉండలేరు.

అదే సమయంలో కుటుంబంతో, ఒక వర్గంతో, సామాజిక సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు ఆనందంగా ఉంటారు. సంబందిత కార్యకలాపాలు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ప్రస్తుతం పూర్తిస్థాయిలో సొసైటీ, ఇతరుల అంచనాలను చేరుకోకపోవడంతో అసంతృప్తి ఏర్పడుతుంది. నేటి యువతరంతో పాటు కాలేజీ విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతూ ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్ట్రాగామ్‌లోనో తాము పెట్టే పోస్టులకు తగిన లైకింగ్‌లు రాలేదనో, తమకంటే ఇతరులు అందంగా ఉన్నారనో ఇలా అసంతృప్తికి గురవుతున్నారు. మనకు కావాల్సినవన్నీ సమకూరుతున్నా, పెద్దగా సమస్యలు లేకపోయినా ఇంకేదో కావాలని కోరుకుంటూ అది దొరకకపోతే నిరాశ, నిస్పృహలకు గురవుతున్న వారు కూడా ఉన్నారు.  – డాక్టర్‌ నిషాంత్‌ వేమన, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, సన్‌షైన్‌ ఆసుపత్రి

సమాజమూ సంతోషపడేలా చేయాలి
జీవితంలో ఏది ముఖ్యమనే ప్రశ్నకు సంతోషంగా ఉండడమేననే సమాధానమే వస్తుంది. ప్రపంచంలో ఎవరు కూడా నాకు ఆనందంగా ఉండడం ఇష్టం లేదని చెప్పే పరిస్థితి లేదు. ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే ఆనందం కానీ సంతోషం కాని ఎలా వస్తుందనేది ముఖ్యం. అసలు సంతోషమంటే ఏమిటి? మనసులో కలిగే ఓ మధుర భావన, ఒక కదలిక. ప్రత్యేక ఆహార పదార్థాలు, నచ్చిన సువాసనలు, అందమై దృశ్యాలు, వినసొంపైన సంగీతం, తదితరాలు మంచి అనుభూతిని కలిగించడంతో పాటు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు, అంచనాలు చేరుకుంటే, ఏదైనా విషయంలో విజయం సాధిస్తే అది సంతోషాన్ని కలిగిస్తుంది.

అయితే ఇవి ఒక్కొక్కరి అలవాట్లు, పద్ధతులు, ఆలోచనా ధోరణులు, పెరిగిన వాతావరణం తదితర ప్రభావాలకు అనుగుణంగా మారిపోతుంటాయి. అయితే వ్యక్తిగత స్థాయి హ్యాపీనెస్‌ కంటే కూడా సమూహ సమిష్టి ఆనందం ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. సంతోషం, సంతృప్తి్త, ఆనందం అనేవి కేవలం మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విశాల సమాజానికి, వర్గానికి కలిగేలా చేయడం ద్వారా జీవితానికి ఒక సార్థకత, అర్థం ఏర్పడుతుంది. అదే సమయంలో అçపరిమితమైన ఆశలు, ఆశయాలు, నెరవేర్చుకోలేని కోరికలతో సతమతమవుతుండటం కూడా మంచిది కాదు. కోరికలను నియంత్రించుకుంటే అంచనాలు తగ్గి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
– డాక్టర్‌ ఎమ్మెస్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, డైరెక్డర్, ఆశా హాస్పిటల్స్‌

అవసరాలు పూర్తి చేసుకోవడంలోనే ఆనందం
ప్రముఖ అమెరికా సైకాలజిస్ట్‌ అబ్రహాం మాస్లో 1970లలో చేసిన సైద్ధాంతీకరణ ప్రకారం.. మనిషి జీవితం ప్రధానంగా ఐదు ముఖ్యమైన అవసరాలను పూర్తి చేసుకోవడంలోనే ముగుస్తుంది. ఆహారం, నీళ్లు, శృంగారం, నిద్ర వంటి శారీరక అవసరాలు.. శారీరక భద్రత, ఉద్యోగ, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తుల భద్రత.. ప్రేమ, తనదనే భావన, లైంగిక పరమైన దగ్గరితనం.. ఆత్మగౌరవం, విశ్వాసం, ఇతరులను గౌరవించడం.. స్వీయ వాస్తవికత (సెల్ఫ్‌ యాక్చువలైజేషన్‌), నైతికత..వీటిలోనే సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అంశాలు ముడివడి ఉన్నట్టుగా మాస్లో సూత్రీకరించాడు. ప్రపంచంలో అత్యధిక శాతం మంది శారీరకంగా ఆకలి, సెక్స్, ఆహారం తదితరాల లభ్యతకు సంబంధించిన అవకాశాలు, సామాజికంగా తెలిసిన వారితో ప్రేమ, స్నేహసంబంధాలు, బంధుత్వాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటి సాధనతోనే సంతోషపడి సంతృప్తి పడతారు.

ఎప్పుడైతే ఈ రెండు తీరతాయో అప్పుడు ఒక వర్గానికో, ఒక గ్రూపుకో నాయకత్వం వహించాలని కోరుకుంటారు. లీడర్‌గా ఒకస్థాయికి చేరుకున్నాక ఇతరులకు మంచిచేయడం, ఇతరుల కోసం కృషి చేయడంలో సంతోషం, ఆనందం పొందడం జరుగుతుంది. ప్రస్తుత సమాజం చాలా వేగంగా మారడం, ఇందులో.. అందంగా కనిపించేందుకు ఎక్కువగా ప్రయత్నం, ఆలోచించగలగడం వంటివి జరుగుతున్నాయి. అందువల్లే తమ ముందుతరంతో పోల్చితే యంగర్‌ జనరేషన్‌ తెలివిగా, నూతనంగా ఆలోచిస్తుంటుంది. కొత్త పోకడలతో సృజనాత్మకంగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంటుంది.  – సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌
చదవండి: Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్‌..

మరిన్ని వార్తలు