కరోనా డాక్టర్ల కాసుల దందా

19 Sep, 2020 04:28 IST|Sakshi

పాజిటివ్‌ వచ్చినా ప్రాక్టీసు వదలని కొందరు వైద్యులు

గుట్టుగా ప్రాక్టీసు.. వారితో పలువురు రోగులకు వ్యాప్తి 

ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్ల తీరుపై ఫిర్యాదుల వెల్లువ

► అతని పేరు డాక్టర్‌ శివశంకర్‌ (పేరు మార్చాం). యాదాద్రి జిల్లాలోని ఒక పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌. అతనికి చౌటుప్పల్‌లోనూ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ ఉంది. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయినా ఆ విషయాన్ని దాచిపెట్టి సొంత ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేస్తున్నారు.  

► డాక్టర్‌ రమణ (పేరు మార్చాం). ఇతను జనగామలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. స్థానికంగా ఉండే ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలోనూ అతను కన్సల్టెంట్‌. ఇటీవల అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలినా రెండు చోట్లకు వెళ్లి రోగులను పరీక్షిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్లు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచిపెట్టి మరీ రోగులకు వైద్యం చేస్తున్నారు. దీంతో వారి నుంచి రోగులకు కరోనా సోకుతోంది. విశ్రాంతి లేకుంటే వైరస్‌ లోడు పెరిగి వ్యాధి ముదురుతుందని తెలిసినా వా రు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  

కాసుల కోసం కక్కుర్తి..
అసలే వర్షాకాలం. కరోనాకు తోడు సీజనల్‌ వ్యాధులు బాగా ప్రబలేకాలం. ఈ సమయం లో ప్రాక్టీస్‌ బంద్‌ పెడితే తమ ఆదాయానికి గండిపడుతుందనే దురాశ కొందరు డాక్టర్లను వెన్నాడుతోంది. మరోవైపు ఇప్పుడే కాస్తంత డబ్బులు సంపాదించుకోవచ్చన్న కక్కుర్తి. చౌటుప్పల్‌లో క్లినిక్‌ నడుపుతున్న ఓ వైద్యుడి కుటుంబంలోని వారికి కూడా వైరస్‌ సోకింద ని వైద్య ఆరోగ్య శాఖలో టాక్‌. అయినా కాసు ల ముందు ఆయనకు ఏ వైరసూ కనిపించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.  

ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న దుస్థితి
ఒక ప్రభుత్వ డాక్టర్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటారు. ఆయన సమీప జిల్లాలోని ఓ పీహె చ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌. అక్కడ విధులు ము గించుకున్నాక సమీపంలోని చిన్న పట్టణంలో ప్రైవేట్‌ ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేస్తుంటారు. హైదరాబాద్, ఇక్కడికి రానూ, పోనూ 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణం చేస్తుంటారు. ఆ డాక్టర్‌కు కొన్ని రోజుల క్రితం కరో నా సోకింది. అయినా అంతదూరం సొం తం గా కారు నడుపుకుంటూ వెళ్లి వస్తున్నారు. అ లా ఐదారు రోజులు విశ్రాంతి లేకుండా పనిచేయడంతో వైరస్‌ ముదిరింది.

దీంతో ఆ డాక్టర్‌కు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స ఇచ్చారు. పరిస్థితి సీరి యస్‌గా ఉండటంతో మరో ఆసుపత్రిలో ఎక్మో ట్రీట్మెంట్‌కు రిఫర్‌ చేసినట్లు తెలిసింది. పాజిటివ్‌ వచ్చాక 14 రోజులు విశ్రాంతి తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా కొందరు లెక్కచేయడం లేదు. పైగా కొందరు ప్రభుత్వ వైద్యులైతే పాజిటివ్‌ వచ్చాక సెలవు పెట్టి మరీ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కరోనా సోకిన వైద్యులు ప్రాక్టీస్‌ చేసినట్లు నిర్ధారించుకున్నాక చర్యలు తీసుకుంటామని వెద్య, ఆరోగ్యశాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు