నిర్లక్ష్యంతోనే శిశువు మృతి?

31 Jul, 2020 12:36 IST|Sakshi
ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు

ఆసుపత్రి ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన

జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు

పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్‌/ ఓదెల : సుల్తానాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ నిర్లక్ష్యానికి ప్రసవంలోనే శిశువు కన్నుమూశాడు. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం..కాల్వశ్రీరాంపూర్‌ మండలం మంగపేట గ్రామం నుంచి బుధవారం సాయంత్రం ప్రసవంకోసం ప్రభుత్వాసుపత్రికి గర్భిణి లావణ్యను ప్రైవేటు వాహనంలో తరలించారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది లావణ్యకు  హార్ట్‌ బీట్‌తోపాటు గర్భంలో పిండం సక్రమంగానే ఉందని చెప్పారు. ఉదయం ప్రసవం చేసే సమయంలోనూ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు తీసుకెళ్లిన వైద్యులు 11 గంటలకు బయటకు వచ్చి భర్త సంతకం తీసుకున్నారు. లావణ్యకి మొదటికాన్పుకావడంతో సాధారణ ప్రసవంకోసం సిబ్బంది వేచి చూసినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

నొప్పులు వస్తున్నాయని చెప్పినా ఆలస్యం చేయడం వల్లే శిశువు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 28న స్కానింగ్‌ తీసిన సమయంలో పిండం సక్రమంగానే ఉందని చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆపరేషన్‌ చేసే సమయంలో శిశువును బయటకు తీసినట్లు, గర్భంలోనే మెడకు బొడ్డుతాడు పెనవేసుకోవడంతోపాటు ఉమ్మనీరు మింగాడని వైద్యులు చెబుతున్నారు. దీనిపై లావణ్య భర్త రవి, కుటుంబసభ్యులు జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌కు ఫిర్యాదు చేసి డీడీఓ శ్రీరామ్‌కు అందజేశారు. దీనిపై ఆయన వివరణకోరగా తల్లీబిడ్డను కాపాడడానికి వైద్యులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేశారని వివరించారు. ఆక్సిజన్‌ పెట్టి బతికించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం కనబడలేదని చెప్పుకొచ్చారు. కాగా సిబ్బంది, డాక్టర్‌ నిర్లక్ష్యం ఉన్నట్లు పలు సంఘటనలు ఇది వరకే జరిగాయని విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఓదెల మండలం కొలనూర్‌ గ్రామంలో శిశువు అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు