Covid-19: పెరుగుతున్న గుండె కుడివైపు వైఫల్య సమస్యలు

28 Jun, 2021 08:34 IST|Sakshi

కరోనా సెకండ్‌వేవ్‌లో వివిధ రూపాల్లో ప్రభావం 

పెరుగుతున్న కుడి గుండె వైఫల్య సమస్యలు: కన్సల్టెంట్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ విక్రమ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి రెండుదశల దాడి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు, సమస్యల నుంచి ప్రజలు పూర్తిగా తేరుకునేందుకు సుదీర్ఘ కాలమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శరీరంలోని ప్రధాన అవయవమైన గుండె ఎప్పుడు, ఏ రూపంలో, ఎన్ని రకాలుగా ప్రభావితం అవుతుందనేది అంతు చిక్కడం లేదు. కోవిడ్‌ సోకాక కోలుకునే క్రమంలో, ఆ తర్వాతా ఇలా ఏ సందర్భంలోనైనా వైరస్‌ కారణంగా గుండె ప్రభావితమయ్యే అవకాశాలున్నట్టు తాజాగా వైద్యులు తేల్చారు. గతేడాది మొదటి దశలోనే కరోనా నుంచి కోలుకున్నాక గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు.

అయితే సెకండ్‌వేవ్‌లో మాత్రం వివిధ రూపాల్లో సమస్యలు బయటపడుతున్నట్లు చెబుతున్నారు. గుండె లయలు తక్కువగా ఉండడం లేదా ఎక్కువగా ఉండడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, రక్తప్రసరణ అధికం కావడం వంటి లక్షణాల ద్వారా సమస్య గుర్తించొచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ వైరస్‌ గుండెను ప్రభావితం చేస్తోందంటున్నారు. అందువల్ల కోలుకున్నాక గుండె పరీక్ష చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 

కాళ్ల రక్తనాళాల్లో గడ్డలతో ప్రమాదం 
‘శరీరంలోని చాలావరకు కాళ్ల లోపలి ఒకటి లేదా ఎక్కువ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం ‘డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌’కు దారితీస్తుంది. కాళ్ల వాపు లేదా నొప్పికి ఇది కారణం అవుతుంది. కాళ్ల రక్తనాళాల్లో  ఏర్పడిన గడ్డలు ఊపిరితిత్తులకు చేరుకున్నప్పుడు వాటిలోని ఏదైనా ధమనిలో రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. దీనిని పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఇలా జరిగినప్పుడు గుండె కుడివైపు వైఫల్యమయ్యే అవకాశాలు పెరుగుతాయి. కోవిడ్‌ పేషెంట్లలో లెఫ్ట్‌ హార్ట్‌ (గుండె ఎడమ భాగం) ఫెయిల్యూర్ల కంటే రైట్‌ హార్ట్‌ (గుండె కుడిభాగం) ఫెయిల్యూర్లు ఎక్కువగా ఉంటున్నట్టుగా వెల్లడైంది..’ అని డాక్టర్‌ విక్రమ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్త లేదా దాని బారిన పడ్డాక చికిత్సలో భాగంగా తీసుకున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ వంటి మందులు కొందరిపై దుష్ప్రభావాలు చూపిస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు.   

మరిన్ని వార్తలు