డాక్టర్లు లేక.. !

10 Aug, 2020 10:07 IST|Sakshi

కరోనా బాధితులు విలవిల

సకాలంలో అందని వైద్యం

హైదరాబాద్‌ ఆస్పత్రులకు పరుగులు

వైద్యుల కొరతతో తీవ్ర ఇబ్బందులు

ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటులోనూ జాప్యం

సాక్షి, యాదాద్రి : కరోనా బాధితులకు జిల్లా స్థాయిలోనే వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా స్థానిక పరిస్థితులు మరోలా ఉన్నాయి. ప్రధాన ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ డాక్టర్ల కొరత ఉండడంతో బాధితులకు సకాలంలో వైద్యం అందడం లేదు. ఇప్పటికే ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేసి అందుబాటులోకి తేవాల్సి ఉండగా వైద్యులు లేకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. దీంతో కరోనా బాధితులు అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వైద్యంకోసం అక్కడ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరో వైపు జిల్లాలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్‌లతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతో రిపోర్టులు వెనువెంటనే వస్తున్నాయి. వీరిలో లక్షణాలు సీరియస్‌గా ఉన్నవారిని ఉంచేందుకు ఇప్పటి వరకు ఐసోలేషన్‌ వార్డులు అందుబాటులోకి రాలేదు.  

డాక్టర్ల కొరత తీవ్రం
భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రి, రామన్నపేటలో ఏరియా హాస్పిటల్, ఆలేరు, చౌటుప్పల్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లతో పాటు మరో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు బీబీనగర్‌లో ఎయిమ్స్‌లోనూ సేవలందిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో సుమారు 40 మంది డాక్టర్ల కొరత ఉంది. ఎయిమ్స్‌లో అత్యవసర వైద్యంకోసం ప్రత్యేకంగా ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించారు. డాక్టర్లు, అనుబంద సిబ్బంది కోసం ఔట్‌ సోర్సింగ్‌లో నియామకాలు చేపట్టాలని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇంటర్వ్యూకు  ఇద్దరు డాక్టర్లు హాజరైనప్పటికీ విధుల్లో చేరలేదు. దీంతో మరోసారి డాక్టర్ల కోసం ఇంటర్వ్యూలకు పిలిచారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా  తాత్కాలిక పద్ధతిలో డాక్టర్లను నియమిస్తున్నారు. జిల్లాకు అవసరమైన డాక్టర్లు వస్తే తప్ప ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్యం అందించే పరిస్థితి లేదు. 

సలహాలు, సూచనలకే పరిమితం
జిల్లాలో ప్రస్తుతం ఉన్న వైద్యులు కేవలం కరోనా పరీక్షలు, కిట్‌ల పంపిణీ, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి సలహాలు, సూచనలకే పరిమితం అవుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 20 పడకలతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇక్కడ బెడ్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లు మాత్రమే ఉన్నాయి. వెంటిలేటర్లు, డాక్టర్లు లేరు. 

పెరుగుతున్న రికవరీ సంఖ్య
­జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు,యాదగిరిగుట్ట, మోత్కూరు మండలాల్లో పాజిటివ్‌ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇప్పటికే 440 దాటాయి. కోలుకున్న వారు 200 వరకు ఉన్నారు. ప్రస్తుతం 212మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో 33 మంది హైదరాబాద్‌లోని ప్రైవేట్, గాంధీ, నేచర్‌క్యూర్‌ ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారు రూ.లక్షలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వైద్యుల కొరత తీర్చి స్థానికంగా ఐసోలేషన్‌ వార్డులన్నీ అందుబాటులోకి వస్తే కొంత ఊరటకలగనుంది. 

వైద్యుల కొరత నిజమే..
జిల్లాలో వైద్యుల కొరత ఉన్నది నిజమే. ప్రభుత్వం త్వరలో కొంతమంది డాక్టర్లను నియమించనుంది. వారు  జిల్లాకు వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు అందించే వైద్యసేవలు మెరుగుపడతాయి. ఎయిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డులో డాక్టర్ల నియామకానికి ఇంటర్వ్యూలకు పిలిచాం. జిల్లాలో ప్రస్తుతం ఉన్న వైద్యుల కరోనా బాధితులకు అందుబాటులో ఉంటున్నారు. వారికి కరోనా కిట్‌లు అందజేయడం, ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకొని వైద్యం అందిస్తున్నారు.  –అనితారామచంద్రన్, కలెక్టర్‌

>
మరిన్ని వార్తలు