ఇప్పుడు అసలైన ఆయుధం ప్లాస్మా: చిరంజీవి

7 Aug, 2020 16:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాస్మా దానం వల్ల కోవిడ్‌ బారినపడ్డవారిని ఆదుకున్నవారమవుతామని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. దీనిపై ఎవరూ అపోహలకు గురికావొద్దని, ఫ్లాస్మాను దానం చేయడం ద్వారా ఎలాంటి బ్లడ్ లాస్ జరగదని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైబరాబాద్ పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్లాస్మా దానం చేసిన కొందరిని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌తో కలిసి చిరంజీవి శుక్రవారం సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్త దానం నుంచి ఫ్లాస్మా దానం వరకు సైబరాబాద్  పోలీసులు చేస్తున్న సేవలను గుర్తుంచుకోవాలి. ఇలాంటి మంచి మార్గం లో నన్ను నడిపిస్తున్నందుకు సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు. 
(చదవండి: ప్లాస్మాతో ప్రాణం)

22 ఏళ్ల క్రితం నాకు  సామాజిక బాధ్యత తెలియని సమయంలో న్యూస్ పేపర్‌లో ఒక వార్తా  చూసి చలించి పోయాను. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఎంతోమంది రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని గమనించి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేశాను. దీనికి అభిమానులు సహకరిస్తూ, నిత్యం రక్త దానం చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ మధ్య మాకు కేంద్ర ప్రభుత్వం బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు ఇచ్చింది. ఈ కోవిడ్ పరిస్థితిల్లో ఇప్పుడు అసలైన ఆయుధం ఫ్లాస్మా. ఈ ఫ్లాస్మా దానం చేయడంతో మరో ప్రాణాన్ని కాపాడిన వారమవుతాం. రెండు రోజుల క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది.  వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు అనే వ్యక్తిని ఫ్లాస్మా దానం చేయమని చెప్పాను అతను ప్లాస్మా దానం చేయడంతో మా బందువు ప్రాణాలతో బయట పడ్డాడు.

మా ఇంట్లో, నా దగ్గర పని చేసే వర్కర్స్ కి నలుగురికి కరోనా సోకింది. వంట మనిషి శ్రీను, స్విమ్మింగ్ లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరికి కరోనా సోకింది. ఇప్పుడు వారందరు కోవిడ్ నుండి కోలుకుని పనిలో చేరారు. వాళ్ల ప్లాస్మా ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇంట్లో అందరూ భౌతిక దూరం పాటిస్తున్నాం. బయటకు దగ్గాలంటే భయమేస్తోంది. ఫిజికల్‌ డిస్టెన్స్ అనేది భార్యాభర్తలను కూడా విడదీసింది. కోవిడ్ నుండి కోలుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఫ్లాస్మా దానం చేయండి. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ఫ్లాస్మానే మనల్ని కాపాడుతుంది’అని చిరు పేర్కొన్నారు.
(తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు)

మరిన్ని వార్తలు