ఆలస్యం చేయకండి..!

15 Aug, 2020 04:14 IST|Sakshi

సాధారణ జ్వరమని ఆలస్యం చేస్తే ప్రాణాల మీదకు.. ఒంట్లో నలత అనిపించగానే.. అప్రమత్తత అవసరం

55 ఏళ్లు దాటిన మధుమేహం, ఆస్తమా బాధితులపై వైరస్‌ స్వైరవిహారం

క్షణాల్లో ప్రాణవాయువు అందకుండా పోతున్న వైనం

ముందుచూపుతో మరింత పక్కాగా ఎదుర్కోవాలంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరంపై ఒకవైపు కరోనా వైరస్‌.. మరోవైపు సీజనల్‌ వ్యాధులు విశ్వరూపం చూపుతున్నాయి. జ్వరాలపట్ల అలసత్వంగా ఉన్నా, చికిత్సకు ఆలస్యం చేసినా పంజా విసిరి జనాలను ఆగం చేస్తున్నాయి. కరోనాలోనూ, మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌లోనూ జ్వరమే సాధా రణంగా కనిపించే లక్షణం. కరోనా కాలంలో ఎవరిలో? ఏ జ్వరం ఉందో? గుర్తించడం బాధితులకే కాదు.. వైద్యులకూ ఇబ్బందిగా మారింది. చాలామంది కరోనా జ్వరాలను కూడా సాధారణ జ్వరంగా భావించి చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం టెస్టు కూడా చేయించుకోవడం లేదు. ముఖ్యంగా యాభై ఐదేళ్లు పై బడిన బీపీ, షుగర్, ఆస్తమా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుం టున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహా యతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుసహా ప్రముఖ గాయకుడు నిస్సార్, బహుజన మేధావి ఉ.సా, ప్రముఖ జర్నలిస్టు పీవీరావుతోపాటు పలువురిలో అక స్మాత్తుగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో..
ఇప్పటివరకు కోవిడ్‌ బారిన పడిన బాధితుల్లో 40 ఏళ్లలోపువారు 57.1 శాతం మంది ఉండగా, ఆపై వయసు వారు 48.8 శాతం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలోనూ హైపర్‌ టెన్షన్, మధుమేహం, ఆస్తమా ఇలా ఏదో ఒక ఇతర అనారోగ్య సమస్య ఉంటుంది. సాధారణ యువకులతో పోలిస్తే వీరిలో రోగనిరోధకశక్తి తక్కువ. వీరిలో చాలామంది తమ పని ప్రదేశాల్లో 35 ఏళ్లలోపు సాధారణ యువకులతో కలిపి పని చేస్తుంటారు. యువకులు అసింప్టమేటిక్‌గా ఉంటున్నారు. వీరిలో చాలామందికి తమకు వైరస్‌ సోకిన విషయమే తెలియడం లేదు. వీరంతా తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్‌ ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు.

అసింప్టమేటిక్‌ బాధితుల నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 55 ఏళ్లు పైబడినవారికి వైరస్‌ సోకుతోంది. వీరిలో చాలామంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గుగా భావించి టెస్టులు, చికిత్సలను లైట్‌గా తీసుకుంటున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుండటంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్‌ శాతం పడి పోయి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వీరిని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిం చాల్సి వస్తోంది. పరిస్థితి విషమించి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు, పడకలు, వైద్య సిబ్బంది నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వస్తోంది.

అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే...
సాధారణ ప్రజలతో పోలిస్తే.. వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే చికిత్స లను ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒంట్లో ఏ చిన్న లక్షణం కన్పించినా చాలామంది వెంటనే అప్రమత్తమైపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వివిధ కషాయాలు తాగుతూ పౌష్టికాహారం తీసుకుంటూ ప్రాణాయామం వంటి యోగాసనాలు చేస్తూ వైరస్‌ను జయిస్తు న్నారు. కానీ, వైద్యంపై కనీస అవగాహన లేని ఇలాంటివారితో పోలిస్తే.. ఉన్నత చదువులు చదివి, వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనలు పరిశీలిస్తే అవగతమవుతుంది. వీరు అతి తెలివిగా ఆలోచించి, చివరకు చిక్కుల్లో పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు.. చికిత్స వరకు... ఇలా ప్రతి విషయంలోనూ దాటవేత ధోరణినే అవలం బిస్తూ చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వైరస్‌ను ముందే గుర్తించి అప్రమత్తమైతే... ప్రమాదం నుంచి బయట పడేవారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శ్వాసనాళాలపైనే ఎక్కువ ప్రభావం..
ప్రస్తుతం కంటికి కన్పించని ప్రమాదకరమైన కరోనా వైరస్‌తో పోరాడుతున్నాం. ఇది ఒకరి నుంచి మరొకరికి ముక్కు, కన్ను, చెవి, నోరు వంటి భాగాల ద్వారా ప్రవేశిస్తుంది. ముందు గొంతు, శ్వాసనాళాలు, ఆ తర్వాత గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. వృద్ధులు, మధుమేహులు, ఆస్తమా బాధితులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వైరస్‌ బారి నుంచి బయటపడొచ్చు. నిర్లక్ష్యం చేయడం ద్వారా వైరస్‌ శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలో ఆక్సిజన్‌ శాతం పడిపోతుంది. ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుంది. ముందుగానే టెస్టు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ, చాలామంది ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – డాక్టర్‌ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్‌ ఆస్పత్రి 

మరిన్ని వార్తలు