పావురాలతో సెల్ఫీలొద్దు!

21 Jan, 2021 08:38 IST|Sakshi

రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేకున్నా.. ముందు జాగ్రత్త మేలు

మాస్క్, గ్లౌజ్‌ లేకుండా పక్షులను ముట్టుకోకపోవడమే మంచిది

వైరస్‌ వేగంగా సోకే అవకాశం ఉన్నందున జరభద్రం

బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో నిపుణుల జాగ్రత్తలు

సాక్షి, హైదరాబాద్‌: నగరం లక్షల పావురాలకు ఆవాసం. రోజూ కొన్ని వేల మంది వీటికి తిండి గింజలు వేస్తుంటారు. 500 ప్రాంతాల్లో ప్రత్యేకంగా తిండి గింజలు వేసే కేంద్రాలున్నాయి. చాలా మందికి ఇలా తిండి గింజలు వేసి.. వాటితో సెల్ఫీ దిగడం అలవాటు. కొద్ది రోజుల వరకు ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో పక్షి ప్రేమికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించనప్పటికీ ఆ వ్యాధి ఉన్న ప్రాంతం నుంచి వచ్చే పక్షుల వల్ల వైరస్‌ ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల పాటు జనం జాగ్రత్తతో ఉండాలని చెబుతున్నారు.

పావురాల గుంపులోకి వెళ్లొద్దు..
ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వృద్ధి చెందుతున్న పావురాలతో సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌ సహా సమీప ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో పావురాలున్నాయి. వలస పక్షుల ద్వారా ఈ పావురాలకు బర్డ్‌ఫ్లూ సోకి.. వేగంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. పావురాలకు నిత్యం తిండి గింజలు వేయడం చాలా మందికి అలవాటు. ఇది మంచిదే అయినా.. కొందరు పావురాల గుంపుల్లోకి వెళ్లి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఆ సమయంలో పావురాలు ఒక్కసారిగా ఎగిరితే వాటి రెక్కల నుంచి పెద్దమొత్తంలో దుమ్ము కణాలు గాలిలో కలుస్తుంటాయి. ఒకవేళ బర్డ్‌ఫ్లూ సోకిన పావురాలు వాటిల్లో ఉంటే ఆ దుమ్ము ద్వారా వైరస్‌ మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

నిత్యం ఫిర్యాదులు..
ప్రస్తుతం ఎక్కడైనా పక్షి చనిపోతే ప్రజలు బర్డ్‌ ఫ్లూ అనుమానంతో భయపడుతున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పశుసంవర్థక శాఖ అధికారులకు, జీహెచ్‌ఎంసీకి, పక్షుల స్వచ్ఛంద సంస్థలకు ఫిర్యాదులు వస్తున్నాయి. తమ ఇంటి సమీపంలో చెట్టుపై నుంచి పక్షి పడి చనిపోయిందని, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటూ మాకు నిత్యం పది వరకు ఫోన్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కడా బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు.
- సంజీవ్‌ వర్మ, యానిమల్‌ వారియర్స్‌ కన్సర్వేషన్‌ సొసైటీ

అప్రమత్తత అవసరం..
బర్డ్‌ ఫ్లూ విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదు. హైదరాబాద్‌లో పావురాలు పది లక్షలకు చేరువవుతున్నాయి. ఈ విషయంలోనే జనంలో అప్రమత్తత అవసరం. పావురాల గుంపులకు చేరువగా వెళ్లొద్దు. పక్షులు ఎక్కువగా వాలే చెట్ల కింద అధిక సమయం ఉండకపోవడం మంచిది. వాటి రెట్టలు కూడా వైరస్‌ను ప్రబలేలా చేస్తాయి.
- వాసుదేవరావు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, పక్షి విభాగం అధిపతి, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం

మరిన్ని వార్తలు