ఊ అంటారా..ఊహూ అంటారా?: రాష్ట్ర బడ్జెట్‌పై గంపెడాశలు

6 Feb, 2023 10:28 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఐటీ ఎగుమతులు, భూములు, ఇళ్ల విక్రయాలు, మద్యం, మాంసం, పెట్రోల్, డీజిల్‌ అమ్మకాల ద్వారా జిల్లా నుంచే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్నా.. ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాలు సమకూరడం లేదు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలు నీట మునగక తప్పడం లేదు. శివారు మున్సిపాలిటీల్లో ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద కొన్ని పనులు చేపట్టినా.. సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో ఏళ్ల తరబడి పనులు సాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారో.. రిక్తహస్తం చూపిస్తారో వేచి చూడాలి.   

‘పంచాయతీ’ పరిష్కరిస్తారా? 
జిల్లాలో 558 పంచాయతీలు, 13 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. భూముల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు, ఐటీ అనుబంధ సంస్థలు, పారిశ్రామికవాడల ఏర్పాటుతో ప్రభుత్వానికి వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. వీటికి కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో ఆయా స్థానిక సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీధిలైట్లు, పారిశుద్ధ్య పనులు, నర్సరీల్లో మొక్కల పరిరక్షణ, ట్రాక్టర్‌ కోసం బ్యాంకులో తీసుకున్న అప్పులు, డీజిల్‌ ఖర్చులు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, ఇతర నిర్వహణ పనుల కోసం సర్పంచ్‌లు అప్పు  చేయాల్సిన పరిస్థితి. 

గూడు గోడు తీరేనా? 
ప్రభుత్వం 2016–17లో జిల్లాకు 6,777 ఇళ్లకు పాలనా అనుమతి ఇచ్చింది. ఇందుకు 274.35 ఎకరాల భూమిని కేటాయించింది. వీటిలో 6,637 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా ఇప్పటి వరకు 2,445 మాత్రమే తుది దశలో ఉన్నాయి. మిగిలిన వాటిలో ఎలాంటి పురోగతి లేదు. తుది దశలో ఉన్న ఇళ్ల పంపిణీకి లబ్ధిదారులను కూడా ఎంపిక చేసింది. డ్రైనేజీ, వాటర్, విద్యుత్‌ పనులు పూర్తికాకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. ఇందుకు రూ.20 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇటీవల రూ.10 కోట్లు కేటాయించగా మరో రూ.10 కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లోనైనా వీటికి నిధులు కేటాయిస్తారో, లేదో వేచి చూడాల్సిందే. ఖాళీ స్థలాలున్న వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ బడ్జెట్‌లోనైనా దీనికి మోక్షం కలుగుతుందో లేదో చూడాలి.  

నిధుల్లేక నీరసించిన ‘మన ఊరు మనబడి’ 
ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ‘మన ఊరు– మనబడి’ పథకానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అప్పు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడమే ఇందుకు కారణం. జిల్లాలో 1,309 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో తొలి విడతగా 464 స్కూళ్లను ఎంపిక చేసి రూ.97.88 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 30 స్కూళ్లలోనే పనులు పూర్తయ్యాయి. అదీ రంగులు, ఫరి్నచర్, ఎలక్ట్రిసిటీ, తాగునీరు వంటి పనులే జరిగాయి. అదనపు గదుల నిర్మాణం, కిచెన్, ఇతర కీలక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.35 లక్షలకుపైగా వర్కులు ఉన్న స్కూళ్లకు టెండర్లు పిలిస్తే.. కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. 

ఆ ‘రుణం’ ఈసారైనా తీర్చేనా? 
2014 నుంచి 2018 డిసెంబర్‌ 11లోపు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీతో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష రుణమాఫీ చేయనున్నట్లు తెలిపింది. మొదటి విడతలో రూ.25 వేలలోపు రుణాలున్న 10,940 మందికి రూ.16.73 కోట్లు, రెండో విడతలో రూ.50 వేలలోపు రుణాలున్న 24,013 మందికి రూ.82.49 కోట్లు మంజూరు చేసింది. మూడు, నాలుగో విడత రుణాల మాఫీని వి స్మరించింది. పాత రుణాలను మాఫీ చేయకపోవడంతో.. కొత్తగా రైతులకు అప్పు పుట్టడం లేదు.  

వీటి పరిస్థితి ఏమిటి?

  • కోహెడలో రూ.450 కోట్ల అంచనా వ్యయంతో 178 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన పండ్ల మార్కెట్‌కు ఇప్పటి వరకు పైసా విదల్చలేదు.
  • కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌ ఆవరణలో 12 అంతస్తుల్లో రూ.900 కోట్లకుపైగా నిధులతో నిర్మించతలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసి ఆరు నెలలైంది. నిధులు విడుదల చేసినా ఇప్పటి వరకు పునాది రాళ్లు కూడా పడలేదు. 
  • వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 2017–18 వరకు సబ్సిడీపై రైతులకు అందించిన యంత్రాలు, డ్రిప్‌లు, విత్తనాలు, ఎరువులను ఆ తర్వాత నిలిపివేశారు. ఈ బడ్జెట్‌లోనైనా వాటి ప్రస్తావన ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.  
  • ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లోని 84 గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీఓను గత అసెంబ్లీలో ప్రభుత్వం ఎత్తేసింది. దాని స్థానంలో జీఓ నంబర్‌ 69 తెచ్చినా ఇప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు.  
  • బీసీ సంక్షేమశాఖ ద్వారా స్వయం ఉపాధి పథకంలో భాగంగా నిరుద్యోగ యువతకు సబ్సిడీపై బ్యాంకులు రుణాలిచ్చేవి. మూడేళ్ల నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇటు బ్యాంకుల నుంచి సబ్సీడీ రుణాలు అందక, అటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందిపడుతోంది.   
  • ఎస్టీ సంక్షేమశాఖ ద్వారా ఓనర్‌ కం డ్రైవర్‌ పథకంలో భాగంగా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీపై వాహనాలు అందించేవారు. వేలాది మంది దరఖాస్తు దారులకు రెండేళ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు.   
  • జిల్లాలో 20 కేజీబీవీలుండగా ఏ ఒక్క దానికీ సొంత భవనం లేదు. దీంతో ఆయా విద్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొందుర్గు మండలం పులుసుమామిడి, కడ్తాల్‌ మండలాల్లో చేపడుతున్న కేజీబీవీలకు సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. 
  • మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో పని చేస్తున్న వసతి గృహాలదీ ఇదే పరిస్థితి.    
  • జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, వృత్తిదారులు, ఒంటరి మహిళలు, డయాలసిస్‌ పేషెంట్లు మొత్తం 2,07,639 మందిని ఆసరా పెన్షన్లకు ఎంపిక చేసింది. కొత్తగా ఎంపికైన వారికి కార్డులు జారీ చేసినా నిధుల లేమితో నెలవారీ డబ్బులు ఇవ్వడం లేదు.  
  • దళిత బంధు పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి వంద చొప్పున లబ్థిదారులను ఎంపిక చేసి, వారికి ఆర్థిక సాయం అందజేశారు. రెండో విడత కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. నిధుల లేమితో ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదు.    

(చదవండి: ఎన్‌ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు )

మరిన్ని వార్తలు