తాళాలు పగులగొట్టి గృహప్రవేశం

10 Jun, 2021 14:08 IST|Sakshi
తాళం పగుల గొడుతున్న కుటుంబం

‘డబుల్‌’ఇళ్ల కేటాయింపులో ఆలస్యంపై నిరసన

జనగామ జిల్లా బాణాపురంలో ఘటన

సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రం బాణాపురంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల తాళాలను పగులగొట్టి ఏసీరెడ్డి నగర్‌ వాసులు కుటుంబ సభ్యులతో కలసి బుధవారం గృహప్రవేశం చేశారు. నాలుగేళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్నామని, డబుల్‌ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం చేస్తున్నారని నిరసిస్తూ ఈ ఆందోళనకు దిగారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి ఆధ్వర్యంలో 200 కుపైగా కుటుంబాలు ఇళ్ల ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ మధు మోహన్, తహసీల్దార్‌ రవీందర్, ఆర్‌ఐ కృష్ణప్రసాద్, సీఐ మల్లేష్‌ వారికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రాత్రి వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ఏసీరెడ్డినగర్‌లో ఇరవై ఏళ్లకు పైగా నివాసముంటున్న గుడిసెవాసులను 2017లో ఖాళీ చేయించి కలెక్టరేట్‌ నిర్మాణానికి స్థలాన్ని తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించినా కేటాయించకపోవడంతో బాధితులు అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

కాగా, ఇళ్లలోకి వచ్చిన బాధిత కుటుంబాలు భోజనం చేసి ఇక్కడే ఉండిపోయారు. ఈ విషయమై ఆర్డీఓ మధుమోహన్‌ మాట్లాడుతూ..  అర్హుల జాబితా ప్రకారం ఇళ్లను కేటాయిస్తామని, మిగతా వారి విషయంలో విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

మరిన్ని వార్తలు