డీపీఆర్‌లపై కాలయాపన వద్దు 

4 Nov, 2021 04:38 IST|Sakshi

వెంటనే కేంద్రానికి 5 ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపాలి 

గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి బేసిన్‌లోని అయిదు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను కాలయాపన లేకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి పంపాలని తెలంగాణ మరోమారు గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ బోర్డుకు లేఖ రాశారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, మోదికుంటవాగు ప్రాజెక్టులు కొత్తవి కావని.. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించి, ప్రారంభించిన ప్రాజెక్టులని లేఖలో తెలిపారు.

ఈ దృష్ట్యా అయిదు ప్రాజెక్టులు విభజన చట్టం క్లాజు 85 (8) పరిధిలోకి రావని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీలో భాగంగా ఉన్నాయన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ఏవిధమైన ప్రభావాన్ని కలిగించవని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లో ఇరిగేషన్‌ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే పరిధి చట్టం ప్రకారం బోర్డులకు లేదని స్పష్టం చేశారు.

ఈ అంశాలను పరిశీలించేందుకు కేంద్ర జల సంఘంలో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయని వివరించారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కేంద్ర జల శక్తి మంత్రి సైతం డీపీఆర్‌లను త్వరితగతిన పరిశీలించి ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ దృష్ట్యా గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరారు.   

మరిన్ని వార్తలు