ఎన్నికలొస్తున్నాయ్‌ జాగ్రత్త!

30 Sep, 2020 05:50 IST|Sakshi

ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు హెచ్చరిక 

ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు రెట్టింపు  

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రికవరీ రేటు ఉందని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు హెచ్చరించారు. సామూహికంగా జరిపే కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేవారు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 15.42% యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. ఢిల్లీ, అసోంలు మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువగా టెస్టులు చేస్తున్నాయన్నారు. పాజిటివ్‌ రేటు ఎక్కువగా ఉన్న చోట టెస్టుల సంఖ్య పెంచామన్నారు.  

జూన్‌ లో అత్యధిక పాజిటివ్‌ రేటు... 
మార్చిలో 1,087 టెస్టులు చేయగా 9% పాజిటివ్‌ రేటు నమోదైందని శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్‌లో 18,098 టెస్టులు చేస్తే 5 %  పాజిటివ్‌ రేటు, మేలో 11,889 టెస్టులకు 15%, జూన్‌ లో 58,231 టెస్టులకు 23%, జూలైలో 3,69,288 టెస్టులకు 13%, ఆగస్టులో 9,65,253 పరీక్షలకు 7%, సెప్టెంబర్‌ లో ఇప్పటివరకు 15,16,796 టెస్టులకు 4%  పాజిటివ్‌ రేటు వచ్చిందన్నారు. రాష్ట్రంలో రోజూ 50 వేల నుంచి 55 వేల టెస్టులు చేస్తున్నామన్నారు. ఆదివారాల్లో స్పందన తక్కువగా ఉండటంతో తక్కువ పరీక్షలు చేశామన్నారు.  

రికవరీలో రికార్డు..
రాష్ట్రంలో కరోనా బారినపడ్డవారిలో 84 శాతం మంది రికవరీ అయ్యారని, దేశంలోనే ఇది రికార్డు అని తెలిపారు. తెలంగాణ కంటే 23 రాష్ట్రాల్లో రికవరీ రేటు తక్కువగా ఉందన్నారు. సర్కారు ఆస్పత్రుల్లో 25.4% పడకలు నిండిపోగా... 74%పైగా ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 230 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తుండగా.. 34.56% పడకలు రోగులతో నిండి ఉన్నాయన్నారు. వీరిలో సగం మంది వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులేనన్నారు.  

అన్నీ ఆక్సిజన్‌ పడకలే.. 
కొన్ని దేశాల్లో సెకండ్‌ వేవ్‌ వస్తోందని, అది మన దగ్గర రావొద్దని కోరుకుంటున్నామని డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 7,172 ఆక్సిజన్‌ పడకలు, 1,225 వెంటిలేటర్‌ పడకలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని పడకలకు ఆక్సిజన్‌  వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో 1,665 ఆక్సిజన్‌  పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. 

అన్‌ లాక్‌ 5లో మిగిలినవన్నీ తెరుస్తారు
అన్‌ లాక్‌ 5లో భాగంగా మిగిలినవన్నీ కూడా తెరుస్తారని చెప్పారు. ముందుగా చెప్పినట్లు సెప్టెంబర్‌ మాసాంతానికి కేసులు తగ్గుతాయన్న అంచనా నిజమైంద న్నారు. జీహెచ్‌ఎంసీలో కేసులు బాగా తగ్గాయన్నారు. రోజూ 300–350 పాజిటివ్‌ కేసులే వస్తున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి రేటు జూలైలో 1.9 ఉండగా, ప్రస్తుతం అది 0.5 శాతానికి వచ్చిందన్నారు. మిగిలిన జిల్లాల్లో 0.8 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు తెలిపారు. మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్, నల్లగొండ జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తుండటంతో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

వారం పది రోజుల్లో ఆ జిల్లాల్లో కూడా పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. హైదరాబాద్‌లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందన్నారు. మాదాపూర్, హైటెక్‌ సిటీ, సైబారాబాద్‌ ఏరియాల్లో కేసులు తగ్గినా వాణిజ్య కార్యాకలాపాలు అనుకున్న స్థాయిలో అక్కడ ప్రారంభం కాలేదన్నారు. ఐటీ కంపెనీలు భయాందోళనలు చెందకుండా తమ వాణిజ్య కార్యాకలపాలను పూర్తిస్థాయిలో ప్రారంభించుకోవాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు