Bladder Cancer: పారా హుషార్‌.. మూత్రాశయ కేన్సర్‌..

9 Oct, 2021 16:44 IST|Sakshi

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధన ప్రకారం...దాదాపు 45000 మంది మగవాళ్లు, 17వేల మంది మహిళలు ఏటేటా మూత్రాశయ కేన్సర్‌కు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మూత్రాశయ కేన్సర్‌ గురించి విషయాలు, జాగ్రత్తలను అపోలో స్పెక్ట్రా కు చెందిన యూరాలజిస్ట్‌ డా.ప్రియాంక్‌ సలేచా వివరించారు. అదృష్టవశాత్తూ చాలా వరకూ మూత్రాశయ కేన్సర్లు ముందస్తుగానే గుర్తించవచ్చు. తద్వారా చక్కని చికిత్స అందించడం సాధ్యమవుతుంది.

విజయవంతంగా చికిత్స అందించిన తర్వాత కూడా నిరంతర పర్యవేక్షణ, సంప్రదింపులు అవసరం అవుతాయి. మూత్రాశయంలోని యూరోథెలియల్‌ నాళాలపై ప్రభావం చూపే సాధారణ తరహా కేన్సర్‌ ఇది. దిగువ పొత్తికడుపులో మూత్రాన్ని నిల్వచేసేందుకు సహకరించే బోలుగా ఉండే కండర రూప అవయవం ఇది. ఖచ్చితంగా ఇదీ అనే కారణాన్ని మూత్రాశయ కేన్సర్‌కి చెప్పలేం. అయితే నియంత్రణ లేని విధంగా అసాధారణ వృద్ధితో కణజాలం పెరగడం జరుగుతుంది. అవి ఇతర టిష్యూలను కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. 

గుర్తించడం ఎలా...
యూరోథెలియల్‌ కార్సినోమా, స్వే్కమస్‌ సెల్‌ కార్సిమోనా, అడెనోకార్సినోమా, స్కేమస్‌సెల్‌ కార్సినోమా, అడెనో కార్సినోమా పేరిట 3 రకాల మూత్రాశయ కేన్సర్లు ఉన్నాయి. రోగుల్లో యూరోథెలియల్‌ కార్సినోమా లేదా ట్రాన్సిషనల్‌ సెల్‌ కార్సినోమాలు ఎక్కువగా కనిపించే రకాలు. పేరుకు తగ్గట్టే ఈ కేన్సర్‌ మూత్రాశయంలోని అంతర్గత పొరకు చెందిన  ట్రాన్సిషనల్‌ సెల్స్‌లో మొదలవుతుంది. మూత్రాశయ కేన్సర్లతో బాధపడుతున్న ప్రజలు పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి చాలా సార్లు ఇతర వ్యాధులుగా పొరపాటు పడేందుకు కారణమవుతాయి. అలసట, ఆకస్మికంగా బరువు తగ్గడం, ఎముకలు సున్నితంగా మారడం, మూత్ర విసర్జన సమయంలో బాధ, తరచు వేగంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం రావడం, పొత్తికడుపు భాగంలో లేదా వెన్నెముక దిగువ భాగంలో నొప్పి... వంటివి ప్రత్యేకంగా దీనికి సంబంధించిన లక్షణాలుగా పేర్కొనవచ్చు. 

నివారణ...
కొన్ని మార్పు చేర్పుల ద్వారా మూత్రాశయ కేన్సర్‌ను నివారించవచ్చు. 
–థూమపానం చేసినప్పుడు హానికారక రసాయనాలు ఉత్పత్తి అయి చివరగా మూత్రాశయానికి చేరి, అక్కడి లైనింగ్‌ని డ్యామేజ్‌ చేస్తాయి. కాబట్టి  పొగ తాగడం మానేయాలి. 
–దాహార్తి అనే పరిస్థితికి చేరకుండా చూసుకోవడం కూడా మూత్రాశయ కేన్సర్‌ను నివారిస్తుంది. రోజులో వీలైనంత నీరు తాగడం వల్ల అది టాక్సిన్స్‌ను తోసివేసేందుకు మూత్రాశయం దెబ్బతినకుండా ఉండేందుకు సహకరిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీటిని తాగుతూఉండాలి. 
–రబ్బర్, లెదర్, డైస్, టెక్స్‌టైల్స్, పాలిన్‌ ఉత్పత్తుల తయారీలో వాడే కొన్ని రసాయనాల్లో కొన్ని  మూత్రాశయ కేన్సర్‌కు దారి తీసేవి కూడా ఉంటాయి. ఇలాంటి హనికారక రసాయనాలను ఫిల్టర్‌ చేసే ప్రక్రియలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీలైనంత వరకూ ఈ తరహా రసాయనాలను శరీరంలోకి చేరకుండా చూసుకోవాలి. 
–కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మూత్రాశయ కేన్సర్‌తో బాధపతుండడం జరిగి ఉంటే. ఇతరులు కూడా ఆ వ్యాధికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, అలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటే ముందస్తుగానే ఆరోగ్యకర జీవనశైలి అలవరచుకోవడం, వైద్యులను తరచు సంప్రదిస్తుండడం అవసరం. 

ఉపసంహారం...
ఆరోగ్యకరమైన జీవనశైలి, నిద్ర... ఈ వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. అలాగే సిస్టెక్టొమీ అనే సర్జికల్‌ ప్రొసీజర్‌ ద్వారా కూడా ఏ వయసులో సోకిన కేన్సర్‌నైనా విజయవంతంగా చికిత్స చేయవచ్చు. 
డా.ప్రియాంక్‌ సలేచా, యూరాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి

చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు

మరిన్ని వార్తలు