థర్డ్‌వేవ్‌: కెరటమా.. ఉప్పెనా? మీ చేతుల్లోనే ఉంది

30 May, 2021 00:54 IST|Sakshi

థర్డ్‌వేవ్‌పై ‘సాక్షి’తో పీహెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి 

ప్రస్తుతం కేసులు, మరణాల తగ్గుదలను బట్టి చూస్తే జూన్‌ చివరికల్లా కరోనా నియంత్రణలోకి రావొచ్చు. అయితే లాక్‌డౌన్‌లో ఉన్నపుడు సహజంగానే ఇవి తగ్గుతాయి కాబట్టి ఎత్తేశాక వచ్చే వాస్తవ పరిస్థితుల ఆధారం గా మళ్లీ అంచనా వేయాలి. ప్రజలు మళ్లీ మామూలుగా తిరిగేస్తే వైరస్‌ ముప్పు మళ్లీ మొదటికొస్తుం ది. అందువల్లే అంచలంచెలుగా లాక్‌డౌన్‌ సడలిం చాలి. దీంతోపాటు పెద్దయెత్తున పరీక్షలు చేయాలి. అప్పుడే ఇది ఏమేరకు కంట్రోల్లోకి వచ్చిందనేది తెలుస్తుంది. రెండోదశ తగ్గుముఖం పట్టే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. కాని అది వెను వెంటనే వెనక్కు మళ్లుతుందా లేక మరికొంతకాలం పరీక్షిస్తుందా అన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. 

వ్యాక్సిన్‌ సన్నాహాల్లో విఫలం
వ్యాక్సినేషన్‌ మరింతగా అందుబాటులోకి వచ్చేం దుకు అవసరమైన సన్నాహాలు చేసుకోలేకపోయాం. దానివల్ల ప్రైవేట్‌ రంగంలో టీకా కేంద్రాలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ సమయంలో గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు వ్యాక్సిన్లను అందించడానికి అనువైన పరిస్థితుల్లో మనం లేము. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినప్పుడైనా పెద్ద పట్టణాలకు కాకుండా చిన్న నగరాల్లోనూ దీని వేగాన్ని పెంచాలి. ఆ తర్వాత గ్రామాల్లోనూ వ్యాక్సిన్లు అందించాలి. ఏ గ్రామాల్లోనైతే ఆందోళనకర పరిస్థితులున్నాయో అక్కడ అందజేయాలి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లకు జూలై వరకు వేచి ఉండాల్సిందే..

తప్పుడు అంచనాలతోనే ప్రస్తుత పరిస్థితి     
సెకండ్‌వేవ్‌ రాదనే భావన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ని చాలామంది నిపుణుల్లో ఏర్పడడం వల్లనే ప్రస్తు త పరిస్థితి ఏర్పడి ఉండొచ్చునని అనుకుంటున్నా. జనవరి, ఫిబ్రవరిలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి పోయిందనే తప్పుడు అంచనాలు, భ్రమలతో పొరపాటు చేశాం. ఇప్పుడైనా మళ్లీ ఆ పొరబాటు చేయకుండా టీకా ఉత్పత్తి పెంచుకునేందుకు, దిగుమతులు చేసుకునేందుకు ప్రయత్నించాలి.

ఇంగ్లండ్‌లో వ్యవధి తగ్గించారు
టీకాల మొదటి, రెండో వ్యాక్సిన్‌ డోస్‌ల మధ్య కాలవ్యవధి పెంపు విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. రూపాంతరం చెందిన వైరస్‌ వ్యాప్తి, ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దానిపై వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అందువల్ల రెండో డోస్‌ వ్యవధి మరీ ఆలస్యం చేయకూడదన్నది కొందరి అభిప్రాయం. ఇంగ్లండ్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త డేటా కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. అక్కడి నిపుణులు రెండోడోస్‌ వ్యవధిని 8–12 వారాలకు తగ్గించారు. మన దేశంలోనూ అలానే చేయాలని నేను కూడా భావిస్తున్నాను. కానీ 12 నుంచి 16 వారాల వ్యవధి అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం. 

థర్డ్‌వేవ్‌ వచ్చినా తీవ్రం కాకుండా చూసుకోవాలి
వైరస్‌కు, అది రూపాంతరం చెందేందుకు మనం అవకాశం, ఆస్కారం ఇవ్వకపోతే మూడో దశ వచ్చి నా ఎక్కువ హాని చేయకుండా వెళ్లిపోయే అవకాశాలుంటాయి. ఒకవేళ అది కొంత ప్రమాదకరంగా వస్తే దానిని ఎదుర్కోవడానికి అవసరమైన సన్నాహాలు ప్రభుత్వాల పరంగా ముందుగానే చేసుకోవా లి. తీవ్రస్థాయికి చేరితే ఎదుర్కోలేనంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా వైద్య వ్యవస్థను పటిష్టం చేయాలి. కరోనా ఫస్ట్‌వేవ్‌ తర్వాత దీనిపై దృష్టి పెడతామన్నారు. ఈలోగా సెకండ్‌వేవ్‌ వచ్చేసింది. ఇప్పుడు కూడా రెండోదశ ప్రమాదం తొలిగిపోయిందనే భావనలో పడకుండా వైద్యవ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టా లి. ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికలు రూపొం దించి అమలు చేస్తే, ఒకవేళ థర్డ్‌వేవ్‌ తీవ్రంగా రాకపోయినా వైద్య వ్యవస్థ బాగుపడుతుంది.

ప్రజా వైద్య వ్యవస్థ మెరుగుపడాలి
ప్రజా వైద్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎవరికైనా జబ్బులు వచ్చినా వెంటనే గుర్తించే వ్యవస్థ, రోగ నివారణకు తీసుకునే చర్యలు, ప్రజలకు సరైన సమాచారం అందించడం వంటివి చేపట్టాలి. సురక్షితమైన తాగునీరు, ఆరోగ్యకరమైన ఆహారం వంటి వి కూడా ప్రజావైద్య వ్యవస్థ పరిధిలోకే వస్తాయి. ప్రాథమిక సేవలు ఎలా ఉన్నాయి? జ్వరాలు వస్తే వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి త్వరగా గుర్తించగలరా? ఆయా లక్షణాలపై వెంటనే టెస్టింగ్‌ చేయగలరా? అన్నవి పరిశీలించాలి. కోవిడ్‌నే తీసుకుంటే.. వైరస్‌ సోకిన వ్యక్తి ఎంతమందిని కలిశాడు, ఎందరికి వ్యాప్తి చెందిందనే దానిపై కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేసే పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా పబ్లిక్‌ హెల్త్‌ ద్వారానే తెలుసుకోగలం.

ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సబ్‌ సెంటర్లు మొదలుకుని సబ్‌ డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్‌ ఆసుపత్రుల వరకు పబ్లిక్‌ హెల్త్‌సెంటర్లను బలోపేతం చేసి పటిష్ట పరచకపో తే కిందిస్థాయి నుంచి సరైన వైద్యసేవలు, చికిత్స అందించలేం. ప్రజావైద్య వ్యవస్థ బలోపేతంతోనే పబ్లిక్‌ సెక్టార్‌ హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌ను బలోపేతం చేయగలం. అందరూ ఆసుపత్రులకు పరిగెత్తకుండా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకునేలా కుటుంబంలో ని వారికి వైద్యవ్యవప్థ ద్వారా ‘హోంకేర్‌’కు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. కోవిడ్‌తో ఇబ్బందులు పడే నిరుపేదలకు సరిగ్గా మందులు అందించడంతో పాటు ఆహారం ఇతర సదుపాయాలు కల్పించాలి.

పిల్లలపై థర్డ్‌వేవ్‌ ప్రభావం నిర్ధారణ కాలేదు...
థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం పడుతుందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. మొదటిదశలో పెద్ద వయసువారు ఎక్కువగా ప్రభావితం కాగా.. యువత, పిల్లలు పెద్దగా బయటకు వెళ్లలేదు. స్కూల్స్, సినిమాహాళ్లు, మాల్స్‌ వంటివి మూతపడి, ఆటలు, పాటలు లేకపోవడంతో సమస్య తీవ్రం కాలేదు. రెండోవేవ్‌లో ఈ కార్యకలాపాలు మొదలు కావడంతో బయట తిరగడం, గుమిగూడటం వంటి వాటితో వీరిపై తాకిడి పెరిగింది. పెద్దవారిలో ఇమ్యూనిటీ ఏర్పడడంతో పాటు కొందరు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రభావం పెరగలేదు. ఇక వైరస్‌ వెతుక్కుంటూ వెళ్లి పిల్లలను టార్గెట్‌ చేయడమంటూ ఉండదు. కానీ థర్డ్‌వేవ్‌కల్లా పెద్దల్లో వ్యాక్సిన్లు, ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల ఇక మిగిలేది యువకులు, పిల్లలే కాబట్టి ఆ మేరకు వారిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు ఆసుపత్రుల్లో ఎక్కువ సదుపాయాలు కల్పించగలిగితే ఆ తర్వాత అవి వేరే జబ్బులకు కూడా ఉపయోగపడతాయని గ్రహించాలి. 

రూపాంతర వైరస్‌తోనే ఆందోళన
ప్రస్తుతం రూపాంతరం చెందిన బి.1.167 వైరస్‌ ఆందోళన కలిగించేదిగా ఉంది. దేశం లో ఇప్పుడు అదే ఎక్కువ ప్రబలంగా ఉంది. అది బలం పుంజుకుని చాలా ప్రాంతాల్లో త్వరగా ప్రవేశిస్తోంది. అదింకా ప్రమాదకరం గా ఉందనే విషయాన్ని గుర్తించి జాగ్రత్త పడాల్సి ఉంది. వైరస్‌ ఎలాంటి రూపుదాల్చినా నోరు, ముక్కు, కళ్ల ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తున్నందున ప్రజలంతా మాస్క్‌ ధారణ, భౌతికదూరం పాటించడం, గుంపులుగా చేరకుం డా ఉండడం, గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రాంతాల్లోనే ఉండడం ముఖ్యం. ప్రభుత్వాలపరంగా చూస్తే ఈ ఏడాది చివరి వరకు సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్స్‌ నిర్వహిం చకుండా జాగ్రత్త పడాలి. రూపాంతరం చెందుతున్న వైరస్‌ వేరియెంట్లు ఎలా వస్తున్నాయి?, ఎలా వ్యాప్తి చెందుతున్నాయి?, అవి వ్యాక్సిన్లకు ఎలా లొంగుతున్నాయి?, ఎలాంటి మందులు వాటిపై పనిచేస్తున్నాయన్న అంశాలపై మరింత విస్తృత స్థాయిలో పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు