-

టెక్నాలజీనే నమ్ముకుంటే ప్రమాదమే..

22 Mar, 2023 02:26 IST|Sakshi

కేవలం సాంకేతికతతో ప్రశ్నపత్రాల భద్రత సందేహమే 

‘సాక్షి’ఇంటర్వ్యూలో ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వెంకటరామిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు లక్షల మంది ఉద్యోగార్ధులకు సంబంధించిన అంశంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టతోనూ ఇమిడి ఉంటాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు (2005–11) చైర్మన్‌గా, యూపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన డాక్టర్‌ వై. వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు.

సైబర్‌ నేరగాళ్లు సులువుగా రూ. కోట్లు కొట్టేస్తున్న రోజుల్లో కీలకమైన ప్రశ్నపత్రాలను కేవలం టెక్నాలజీతో భద్రంగా ఉంచడం ఎంతవరకు సాధ్యమనే సందేహాన్ని ఆయన వెలిబుచ్చారు. సాంకేతికను కొంతవరకు నమ్ముకొని గత విధానాలను అనుసరిస్తే పేపర్‌ లీక్‌ వంటి ఘటనలకు తావుండబోదని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలు అనేక అంశాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే... 

మానవసహిత భద్రతకే ప్రాధాన్యమివ్వాలి... 
పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీని తెలుసుకొని కేటుగాళ్లు రూ. కోట్లు కొల్లగొడుతున్న రోజులివి. కంప్యూటర్‌ యుగంలో రోజుకో సమస్య తెరపైకి వస్తోంది. అలాంటప్పుడు కేవలం సాంకేతికతపై ఆధారపడటం సరికాదేమో.

టెక్నాలజీని అనుసరించడం అనివార్యమే అయినప్పటికీ లక్షల మంది జీవితాలతో ముడివడిన ఇలాంటి పరీక్షలపట్ల అప్రమత్తత అవసరం. మానవసహితమైన భద్రత కే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదనేది నా అనుభవం. 

అప్పట్లో ఏం చేశామంటే..
నేను ఆరేళ్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశాను. నా హయాంలో ఏనాడూ పేపర్‌ లీక్‌ ఘటనలు చోటుచేసుకోలేదు. అప్పట్లో మేం అనుసరించిన విధానాలు వేరు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇలాంటి కీలక పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో అనుసరించిన విధానాలు లీక్‌లకు ఆస్కారం లేకుండా చేశాయి.

ఒక్కో సబ్జెక్టుకు ఐదుగురు ఎగ్జామినర్లను పిలిచేవాళ్లం. వారిని పూర్తి భద్రత ఉన్న హాలులోకి పంపే ముందే సమగ్రంగా పరీక్షించే ఏర్పాట్లు ఉండేవి. వాళ్ల వద్ద పెన్ను, పెన్సిల్‌ ఆఖరుకు చిన్న కాగితం ముక్క కూడా లేకుండా జాగ్రత్త పడేవాళ్లం. వారు బయటకు వెళ్లేటప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు ఉండేవి. ప్రశ్నపత్రానికి సంబంధించిన అంశాలనేవీ వారు రాసుకొని వెళ్లేందుకు వీల్లేకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొనేవాళ్లం. 

ప్రశ్నపత్రం చైర్మన్‌కు కూడా తెలిసేది కాదు... 
ఒక్కో సబ్జెక్ట్‌ నిపుణుడు ఒక్కో పేపర్‌ను సెట్‌ చేశాక దాన్ని సీల్డ్‌ కవర్‌లో కమిషన్‌ సెక్రటరీకి అందజేస్తారు. సెక్రటరీ తనకు అందిన ఐదు పేపర్లనూ కమిషన్‌ చైర్మన్‌ ముందు పెట్టేవారు. అందులోంచి ఒక పేపర్‌ను చైర్మన్‌ ఎంపిక చేశాక నేరుగా ప్రింటింగ్‌ కేంద్రానికి తరలేది.

ఇక్కడ కమిషన్‌ చైర్మన్‌ లేదా సెక్రటరీ ప్రశ్నపత్రాన్ని చూసే అవకాశం లేదు. అలాగే ఎంపిక చేసిన పేపర్‌ ఏమిటనేది దాన్ని సెట్‌ చేయడానికి వచ్చిన ఐదుగురికి తెలిసే అవకాశమే ఉండదు. ప్రింటింగ్‌ కేంద్రం నిర్వాహకులకు మాత్రమే ఈ పేపర్‌ ఏమిటనేది తెలిసే అవకాశం ఉంటుంది. పేపర్‌ లీక్‌ అయితే కేవలం ప్రింటర్‌ను మాత్రమే బాధ్యుడిని చేసేలా అప్పట్లో నిబంధనలుండేవి.

ఒకవేళ పేపర్‌ లీక్‌ అయితే ప్రింటర్‌కు భారీ జరిమానా విధించేలా నిబంధనలు తెచ్చాం. పేపర్‌ లీక్‌ అయితే ప్రింటర్‌ ఆస్తులన్నీ జరిమానా కింద పోయేంత ప్రమాదం ఉండేది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి రిస్‌్కను ప్రింటర్‌ తీసుకొనే అవకాశం ఉండేది కాదు. ఈ విధానాన్ని అనుసరించడం వల్లే అప్పట్లో పేపర్‌ లీకేజీలు ఉండేవి కావు. 

భద్రత ఎంత వరకూ? 
పేపర్ల లీకేజీపై పత్రికల్లో వస్తున్న కథనాలనుబట్టి ఒక వ్యక్తి పాస్‌వర్డ్‌ తీసుకొని ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇప్పుడున్న టెక్నాలజీపై అనేక అనుమానాలు రావడం సహజమే. ఇది ఎంతవరకు భద్రత ఇస్తుందనేది ఇందులో ప్రధానాంశం.

తాత్కాలిక ఉద్యోగులు ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనే వాదన అర్థరహితం. ఇప్పుడే కాదు... అప్పట్లోనూ తాత్కాలిక ఉద్యోగులు ఉండేవారు. కేవలం కమిషన్‌ నిర్వహణలో విశ్వసనీయతే ఇక్కడ ప్రధానం. ఏ వ్యక్తీ ప్రశ్నపత్రం చూసే అవకాశం లేకుండా చేయడమే ఇక్కడ ముఖ్యం.

మళ్లీ పరీక్ష అనివార్యమే.. 
పేపర్‌ లీకేజీ వల్ల మళ్లీ పరీక్ష నిర్వహించడం అనివార్యమే. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి వర్గాల మనో వేదన వర్ణనాతీతం. అప్పులు చేసి మరీ కోచింగ్‌ తీసుకున్న వాళ్లున్నారు. ఎన్నో ఆశలతో ఇదే జీవితమని భావించి చదివిన వాళ్లూ ఉన్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే వారికి సమస్యే.

కోచింగ్‌ కోసం మళ్లీ అప్పులపాలవ్వాల్సిన పరిస్థితి వారికి ఉండొచ్చు. ఈ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపలేరు. పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వారి ఆవేదనకు కమిషన్‌ కారణం కాకుండా చూడొచ్చు. 
 

మరిన్ని వార్తలు