ఒడిసి పట్టు.. మునగదు ఒట్టు!

29 Sep, 2020 06:10 IST|Sakshi

వర్షపు నీటిని ఇంకేలా చేస్తే ముంపు నివారణ సాధ్యం

ఐఐటీ బాంబే నిపుణుల తాజా అధ్యయనంలో వెల్లడి

గ్రేటర్‌ మునకకు కారణాలు అనేకం

నాలాల విస్తరణను గాలికి వదిలేసిన బల్దియా

సామర్థ్యం సరిపోని మురుగునీటి కాల్వలతోనే ముంపు

సాక్షి, హైదరాబాద్‌: ఏటా సెప్టెంబర్‌లో 5 సెం.మీ. వర్షం కురిస్తే చాలు హైదరాబాద్‌ నిండా మునుగుతోంది. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు గ్రేటర్‌ మునకకు అన్నే కారణాలున్నాయి. వందకుపైగా ముంపు ప్రాంతాలున్నాయి. ఇటీవల కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు రావడంతో దారులు ఏరులను తలపిం చాయి. వరద కారణంగా వాహనదారులు విలవిల్లాడారు. నగరంలో 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించిన మురుగునీటి కాల్వలు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో వాటి సామర్థ్యం సరిపోవడంలేదు. పలు చోట్ల మురుగునీటి పైపులైన్లలో నిర్మాణ వ్యర్థాలు పోగుపడటంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతున్నాయి. అలాగే 1,500 కి.మీ. మేర విస్తరించిన నాలాలపై సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించడంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జడివాన కురిసిన ప్రతిసారి జనం బయటకు రావద్దని బల్దియా హెచ్చరికలు జారీ చేయడం పరిపాటిగా మారింది.

ముంపు సమస్య ఇలా...
నగరంలో ఏటా నమోదవుతున్న వర్షపాతంలో సింహభాగం ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతూనే ఉంది. రామంతాపూర్, భండారీ లే అవుట్, నందీకాలనీ.. లాంటి ప్రాంతాలు నీటమునగడం సర్వసాధారణంగా మారింది. ఈ వరద ముప్పును తప్పించేందుకు చక్కటి ప్రత్యామ్నాయం ఉందని ఐఐటీ బాంబే నిపుణుల తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని పదిలంగా ఒడిసిపట్టడమే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేసింది.

ఇలా చేస్తే ముంపు నుంచి విముక్తి..
గ్రేటర్‌ విస్తీర్ణం 625 చ.కి.మీటర్లు. నివాసాల సంఖ్య సుమారు 25 లక్షలు. ఏటా నమోదయ్యే వర్షపాతం 800–1000 మిల్లీమీటర్లు. ఏడాదికి సుమారు 50–90 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో 25 లక్షల నివాసాలపై కురిసిన వర్షపు నీటిని వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఇంకుడు గుంతలు తవ్వి నిల్వ చేస్తే 43 శాతం ముంపు ముప్పు తప్పుతుందని ఐఐటీ బాంబే నిపుణుల బృందం స్పష్టం చేసింది. కనీసం ఇంటికి 500 లీటర్ల మేర వర్షపు నీటిని నిల్వ చేసినా.. 35 శాతం వరదముప్పు తప్పుదుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 200 లీటర్ల నిల్వచేస్తే 22 శాతం.. ఇంటికి వంద లీటర్లయినా నిల్వచేస్తే 11 శాతం ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడించింది. 

నేలలోకి ఇంకితే..
నగరంలోని ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, పార్కింగ్‌ ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాల్లో... కాంక్రీట్, టైల్స్, బండరాళ్లతో కప్పివేయకుండా మధ్యలో ఖాళీ స్థలాలు వదిలిపెడితే వర్షపు నీరు నేలలోకి ఇంకుతుందని.. వరద తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. సుమారు 185 చెరువుల్లోకి వరద నీటిని చేర్చే ఇన్‌ ఫ్లో చానల్స్, నాలాలను ప్రక్షాళన చేస్తే ముంపు నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని, వాటిల్లో నీటి మట్టం కూడా పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది.

కాగితాలపైనే కిర్లోస్కర్‌ నివేదిక..
నగరానికి ముంపు సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు 2003లో నివేదిక అందించిన కిర్లోస్కర్‌ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అలాగే 2007 గ్రేటర్‌ మొత్తానికీ సమస్య తీరేందుకు ‘సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ .. సూక్ష్మస్థాయి వరద నీటి పారుదల నెట్‌వర్క్‌ ప్లాన్‌ .. మేజర్, మైనర్‌ వరద కాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు’(డీపీఆర్‌) తయారు చేసే బాధ్యతను ఓయంట్స్‌ సొల్యూషన్‌ ్స ప్రైౖ వేట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్‌లో వరద నీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.10,000 కోట్లు అవసరం. బల్కాపూర్‌ నాలా, కూకట్‌పల్లి, ముర్కినాలా, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసిగూడ, ఇందిరాపార్కు నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. కానీ ఈ పనులన్నీ నిధుల లేమితో కునారిల్లుతున్నాయి. 

తక్షణం చేయాల్సిన పనులివీ..
► గ్రేటర్‌లో 1,500 కి.మీ. మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించాలి.
► నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాలంటే.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంతో పాటు మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
► నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. దీనికి రాజకీయ పార్టీల, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి.
► వరద నీటి కాలువల్లో మురుగునీరు పారకుండా చూడాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి.
► స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్‌ ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు.

ఇతర మెట్రో నగరాల్లో ఇలా..
చెన్నై, ముంబై మహానగరాల్లో 50 సెం.మీ.పైగా భారీ వర్షాలు కురిసినా ముంపు తప్పించేందుకు అక్కడి నాలా వ్యవస్థలో భారీ సామర్థ్యంగల పైపులైన్ల ఏర్పాటుతో వరదనీటికి చక్కటి పరిష్కారం చూపారు. ఆ నీటిని సముద్రంలోకి మళ్లించడంతో ఆయా నగరాలకు ముంపు ముప్పు తప్పింది. హైదరాబాద్‌కు సముద్రం లేకపోయినా వర్షపు నీటిని చెరువులు, కుంటలకు మళ్లించడంతోపాటు,లోతట్టు ప్రాంతాల్లో ఇంకుడు కొలనుల ఏర్పాటుచేసి వాటిలోకి మళ్లిస్తే ముంపు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు