President Draupadi Murmu Hyderabad Tour: రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన.. రెండో రోజు షెడ్యూల్‌ ఇదే

27 Dec, 2022 04:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశాధినేత పదవిని చేపట్టాక తొలిసారిగా తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి సోమవారం సాయంత్రం 5.10 గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వేచి ఉన్నారు. రాష్ట్రపతి రాకను చూసి స్వాగతం పలకడానికి వెళ్దామంటూ గవర్నర్‌ను సీఎం కేసీఆర్‌ కోరడంతో.. ఇద్దరూ కలిసి వేదిక దిగి వెళ్లారు.

మంత్రులు, ఇతర ముఖ్యులు వారి వెంట వచ్చారు. రాష్ట్రపతిని ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. తర్వాత రాష్ట్రపతి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ పరిచయం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు హాజరవడంతో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సందడి కనిపించింది.

సీఎం పరిచయం చేసినవారిలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, తలసాని, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, బండి సంజయ్, సోయంబాపురావు, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, పలు శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

యుద్ధ వీరులకు నివాళి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బొల్లారంలోని యుద్ధస్తూపం వద్దకు చేరుకున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు నివాళి అర్పించారు. తర్వాత సాయంత్రం 6.15 గంటల సమయంలో రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు.

రాజ్‌భవన్‌లో విందు.. సీఎం దూరం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం గవర్నర్‌ తమిళిసై సోమవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. దీనికి మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఉన్నతాధికారులు హాజరైనా.. సీఎం కేసీఆర్‌ మాత్రం రాలేదు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత సీఎం కేసీఆర్‌ నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయారు.

గవర్నర్‌తో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలోనే సీఎం విందుకు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్‌భవన్‌ విందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, టీటీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మరికొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో పలకరించుకున్నా..
విభేదాల నేపథ్యంలో చాలాకాలం నుంచి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఒకరికొకరు ఎదురుపడలేదు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణస్వీకార సమయంలో మాత్రం సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ గవర్నర్‌ను కలవలేదు. సోమవారం హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో కూడా గవర్నర్, సీఎం ముభావంగానే కనిపించారు.

రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి హెలికాప్టర్‌ వద్దకు వెళ్తున్నప్పుడు మాత్రం పలకరించుకుని మాట్లాడారు. ఇది చూసి ఇద్దరి మధ్య తిరిగి సఖ్యత కుదురుతుందన్న భావన వ్యక్తమైంది. కానీ గవర్నర్‌ ఇచ్చిన విందుకు సీఎం దూరంగా ఉండటంతో విభేదాలు కొనసాగుతున్నట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇక కొంతకాలంగా మంత్రులు కూడా రాజ్‌భవన్‌కు వెళ్లలేదు. కానీ సోమవారం నాటి విందుకు మాత్రం హాజరయ్యారు.

హైదరాబాద్‌కు వచ్చి.. శ్రీశైలం వెళ్లొచ్చి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలుత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్‌ తమిళిసై, మంత్రి సత్యవతిరాథోడ్‌ ఆమెకు స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రి కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో ఏపీలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో శ్రీశైలం నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బయలుదేరి.. 5.10 గంటల సమయంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

నేడు మిధానిలో మిల్‌ను ప్రారంభించనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌లోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం నారాయణగూడలో కేశవ్‌ మెమోరియల్‌ విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 74వ బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ట్రైనీలతో సమావేశమవుతారు. రక్షణ శాఖకు చెందిన మిధాని సంస్థలో వైడ్‌ ప్లేట్‌ మిల్‌ను ప్రారంభిస్తారు. జాతీయ వ్యూహాత్మక కార్యక్రమాల్లో వినియోగం కోసం ఐరన్, టైటానియం, ఇతర లోహ మిశ్రమాలతో బలమైన రోలింగ్‌ ప్లేట్లను ఈ మిల్‌లో తయారు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు