మీ ఒక్కరి విజయంతో ఆగిపోవద్దు: రాష్ట్రపతి

30 Dec, 2022 04:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ సొంత విజయాలతో సంతృప్తి చెంది ఆగిపోవద్దని.. సమాజంలోని సామాజిక, ఆర్థిక, డిజిటల్‌ అంతరాలను తొలగించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ఉద్యోగాలు చేయడం కోసం కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌ (స్టెమ్‌) రంగాల విద్య, పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు.

గురువారం హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. పరిశోధనలు, సృజనాత్మకత వంటి అంశాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగవుతుందని ద్రౌపదీ ముర్ము చెప్పారు.

ఇటీవలి కాలంలో టెక్నాలజీ వాడకం బాగా పెరిగిందని, అది నిరర్థకం కాకుండా, ఉత్పాదకత పెంచేలా ఉండాలన్నారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఇటీవల తనను కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో డిజిటల్‌ అంతరాలను తొలగించేందుకు, డిజిటల్‌ అక్షరాస్యతను పెంచేందుకు తగిన చర్య లు తీసుకోవాల్సిందిగా ఆయనను కోరినట్టు రాష్ట్రపతి వివరించారు.

విద్యలో మార్పుతో మెరుగైన ప్రపంచం
భారతదేశాన్ని ప్రపంచంలోనే బలీయమైన మేధోశక్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండటం, సమానత్వం, నాణ్యత, బాధ్యత అన్న నాలుగు స్తంభాల ఆధారంగా ఈ కొత్త విద్యావిధానం రూపు దిద్దుకుందని తెలిపారు. సంపూర్ణ, బహుముఖ, పట్టువిడుపులున్న విద్యావ్యవస్థ విద్యార్థుల్లోని నైపుణ్యాలను మరింత సమర్థంగా వెలికితీయగలవని, నేర్చుకునే శక్తిని పెంచగలవని చెప్పారు.

నూతన జాతీయ విద్యా విధానం ఈ అంశాలతో పాటు పరిశోధనలను ప్రోత్సహించడాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందిందన్నారు. ఆధునిక యుగంలో ఇంజనీర్‌ వృత్తి చాలా కీలకమని.. వారికి ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉంటుందని వివరించారు. విద్యార్థినులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలను తీర్చే, పర్యావరణ అనుకూల టెక్నాలజీలను రూపొందించాలని కోరారు.

హక్కులను అడిగి సాధించుకోవాలి: గవర్నర్‌ తమిళిసై
ఒక మహిళ రాష్ట్రపతిగా, త్రివిధ దళాధిపతిగా ఉన్న భారతదేశంలో మహిళలు ఎన్నడూ బలహీనులుగా తమని తాము అనుకోరాదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. మహిళలు తమ హక్కుల కోసం ఎదురు చూడటం కాకుండా వాటిని అడిగి మరీ సాధించుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం విద్యార్థులకు ఆదర్శప్రాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంతి సత్యవతి రాథోడ్, నారాయణమ్మ కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

సమతామూర్తిని దర్శించుకున్న రాష్ట్రపతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం 4.55 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరం క్షేత్రానికి చేరుకున్నారు. ఆమెకు త్రిదండి చినజీయర్‌స్వామి, పలువురు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఆమె సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు.

చినజీయర్‌ స్వామి ఒక్కో ఆలయం విశిష్టతను రాష్ట్రపతికి వివరించారు. తర్వాత రాష్ట్రపతి భద్రవేదికపై చేరుకుని విగ్రహాన్ని, ఆలయాన్ని, సమతామూర్తి విశేషాలను తెలుసుకున్నారు. సాయంత్రం 5.41 గంటల సమయంలో శ్రీరామానుజాచార్యుల సువర్ణమూర్తిని దర్శించుకున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ద్రౌపది ముర్ముకు సమతామూర్తి విగ్రహం, రామానుజాచార్యుల రచనలకు సంబంధించిన పుస్తకాలను చినజీయర్‌స్వామి అందజేశారు. చివరిగా లేజర్‌షోను వీక్షించిన రాష్ట్రపతి రాత్రి 6.35 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు.  

మరిన్ని వార్తలు