ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఐఐసీటీ సాయం

6 Aug, 2022 02:28 IST|Sakshi

డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి 

ఘనంగా ఐఐసీటీ వ్యవస్థాపక దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: దేశం ఆత్మనిర్భరత సాధించే విషయంలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) గణనీయమైన సాయం చేస్తోందని డీఆర్‌డీవో చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్‌ టీకాలకు అవసరమైన కీలక రసాయనాలు మొదలుకొని అనేక ఇతర అంశాల్లోనూ విదేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఐఐసీటీ తప్పించిందని ఆయన అన్నారు.

ఐఐసీటీ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీశ్‌రెడ్డి దేశం ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరాన్ని... అందుకు చేస్తున్న ప్రయత్నాలను సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వం ప్రకటించక ముందు కూడా ఐఐసీటీ పలు అంశాల్లో రక్షణ శాఖ అవసరాలను తీర్చిందని ఆయన గుర్తుచేశారు.

నావిగేషనల్‌ వ్యవస్థల్లో కీలకమైన సెన్సర్ల విషయంలో దేశం స్వావలంబన సాధించడం ఐఐసీటీ ఘనతేనని కొనియాడారు. ప్రస్తుతం అత్యాధునిక బ్యాటరీలు, ఎలక్ట్రోడ్‌లు, ఎలక్ట్రోలైట్ల విషయంలోనూ ఇరు సంస్థలు కలసికట్టుగా పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌కు ముందు దేశంలో ఏడాదికి 47 వేల పీపీఈ కిట్లు మాత్రమే తయారయ్యేవని.. ఆ తరువాత కేవలం నెల వ్యవధిలోనే ఇది రోజుకు 6 లక్షలకు పెరిగిందని చెప్పారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ తయారీ విషయాల్లోనూ ఇదే జరిగిందని, అనేక సృజనాత్మక ఆవిష్కరణల కారణంగా దేశం వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతోపాటు ఉత్పత్తి చౌకగా జరిగేలా కూడా చేశామని వివరించారు. 

డిజైన్‌తో మొదలుపెట్టి...
ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యం సాకారం కావాలంటే దేశానికి అవసరమైనవన్నీ ఇక్కడే తయారు కావాలని డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ ఉత్పత్తుల డిజైనింగ్‌ మొదలుకొని అభివృద్ధి వరకు అవసరాలకు తగ్గట్టుగా భారీ మోతాదుల్లో వాటిని తయారు చేయగలగడం, ఆధునీకరణకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం కూడా ఆత్మనిర్భర భారత్‌లో భాగమని స్పష్టం చేశారు.

అతితక్కువ ఖర్చు, మెరుగైన నాణ్యత కూడా అవసరమన్నారు. అదే సమయంలో దేశం కోసం తయారయ్యేవి ప్రపంచం మొత్తమ్మీద అమ్ముడుపోయేలా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్‌ కార్యక్రమం కారణంగా ఇప్పుడు దేశంలోని యువత రాకెట్లకు అవసరమైన ప్రొపల్షన్‌ టెక్నాలజీలు, గ్రహగతులపై పరిశోధనలు చేస్తున్నాయని... స్టార్టప్‌ కంపెనీలిప్పుడు దేశంలో ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని ప్రశంసించారు.

సృజనాత్మక ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద అన్ని రకాల మద్దతు లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి, మాజీ డైరెక్టర్లకు ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఐఐసీటీలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది, శాస్త్రవేత్తలకు మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ కార్యదర్శి డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ అవార్డులు అందజేశారు.   

మరిన్ని వార్తలు