రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేయగలగాలి 

21 Jan, 2022 04:50 IST|Sakshi

రేపటితరం టెక్నాలజీల అభివృద్ధిపై దృష్టి 

ఇప్పటికే పలు క్షిపణులు, ఆయుధ వ్యవస్థలను రూపొందించాం 

డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: దేశ రక్షణ రంగం ఆత్మ నిర్భరత కోసం ‘రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో)’ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని సంస్థ డైరెక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం కాకుండా.. ఎగుమతి చేసే స్థితికి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని పేర్కొన్నారు. ఇం దుకు రేపటితరం టెక్నాలజీలను చౌకగా, అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. గురువారం ‘అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కి)’ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్‌ పద్ధతిలో ఆయన ప్రసంగించారు.

సంక్లిష్టమైన, కీలకమైన ఆయుధ వ్యవస్థ లను, టెక్నాలజీలను అభివృద్ధి చేయడంపై డీఆర్‌డీవో దృష్టి పెట్టిందని సతీశ్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే భారత్‌ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ దేశమైనా రక్షణ అవసరాలకు సంబంధించి కేవలం క్షిపణులు, ఆయుధాలకు మాత్రమే పరిమితం కాలేదని.. ఆహా రం మొదలుకొని దుస్తుల వరకూ అన్నింటినీ అభివృద్ధి చేయాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ‘ఆకాశ్‌’క్షిపణిని ఇప్పటికే రక్షణ దళాలకు అందించగలిగామని, బీడీఎల్‌ దాదాపు 30 వేల కోట్ల రూపాయల ఆర్డర్లను తయారు చేస్తోందని చెప్పారు.

ధ్వనికంటే ఎక్కువ వేగంతో దూసువెళ్లే బ్రహ్మోస్‌ క్షిపణిలో ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలన్నింటినీ భారత్‌లోనే తయారు చేశామని చెప్పారు. ప్రపంచంలోనే దీర్ఘశ్రేణి కలిగిన తుపాకీ (అడ్వాన్స్‌డ్‌ టోడ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌)ను కూడా అభివృద్ధి చేయగలిగామని సతీశ్‌రెడ్డి వివరించారు. దేశంలో దాదాపు 14 వేల ప్రైవేట్‌ కంపెనీలు, మూడు వందల విద్యా సంస్థలు, అంతర్జాతీయ స్థాయిలో 30 దేశాలు డీఆర్‌డీవోతో కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆస్కి చైర్మన్‌ కే.పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు