డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడగానే లైసెన్స్‌ ఫట్‌

5 Jan, 2022 04:58 IST|Sakshi

మందుబాబుల డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇక ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ 

ఆర్టీఏతో ట్రాఫిక్‌ యాప్‌ అనుసంధానం 

యాప్‌లో డీఎల్‌ క్యాన్సిల్‌ ఫీచర్‌ జోడింపు 

సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను హరించే మందుబాబుల కట్టడికి నగర ట్రాఫిక్‌ పోలీసులు సరికొత్త విధానాలను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికినవారి డ్రైవింగ్‌ లైసెన్స్‌(డీఎల్‌)లను రద్దు చేయాల్సిందిగా సంబంధిత రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(ఆర్టీఏ)లకు ట్రాఫిక్‌ పోలీసులు భౌతికంగా లేఖలు పంపించేవారు. కానీ, ఇక నుంచి ఆ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరిగిపోనుంది. ట్రాఫిక్‌ యాప్‌లో డీఎల్‌ రద్దు అనే కొత్త ఫీచర్‌ను జోడించారు. దీనిని ఆర్టీఏతో అనుసంధానించారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వెంటనే యాప్‌లో డీఎల్‌ రద్దు ఫీచర్‌ను నొక్కగానే క్షణాల్లో సంబంధిత సమాచారం ఆర్టీఏ అధికారులకు చేరుతుంది. వాళ్లు ఆయా డీఎల్‌ను పరిశీలించి రద్దుచేస్తారని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో సమయం ఆదా అవటమే కాకుండా డ్రంకెన్‌ డ్రైవ్‌ వాహనదారులకు భయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.

గతేడాది మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 255 డీఎల్‌లు రద్దయ్యాయి. అత్యధికంగా గతేడాది సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 9,981 డీఎల్‌ రద్దులను ఆర్టీఏకు పంపించగా, 215 డీఎల్‌లు క్యాన్సిల్‌ అయ్యాయి. హైదరాబాద్‌లో 25, రాచకొండలో 15 లైసెన్స్‌లు రద్దయ్యాయి.

ఔటర్‌పై డ్రంకెన్‌ డ్రైవ్‌లు
రాష్ట్ర, జాతీయ రహదారులతోపాటు ఓఆర్‌ఆర్‌పైనా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో ఓఆర్‌ఆర్‌పై కూడా డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రైవింగ్‌ స్కూల్‌ వాహనాలకు ఔటర్‌ రింగ్‌ రోడ్‌పైకి అనుమతి లేదు. గతేడాది సైబరాబాద్‌లో 3,989 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 759 మంది మరణించారు.

సైబరాబాద్‌ పరిధిలోకి వచ్చే ఓఆర్‌ఆర్‌పై 191 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాచకొండ పరిధిలో జరిగిన 2,529 రోడ్డు ప్రమాదాల్లో 618 మంది చనిపోయారు. గతేడాది రాచకొండ పరిధిలోకి వచ్చే ఔటర్‌పై 41 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 19 మంది మరణించారు. 13 రోడ్డు ప్రమాదాల్లో 50 మందికి గాయాలయ్యాయి.

పరిమితవేగాన్ని మించొద్దు 
ఔటర్‌పై వాహనాలను జాగ్రత్తగా నడపాలి. టోల్‌గేట్స్‌ వద్ద మంచు ఎక్కువ ఉందని, వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించే ఏర్పాట్లు చేశాం. పరిమిత వేగానికి మించితే లేజర్‌ గన్‌తో చిత్రీకరించి జరిమానాలు విధిస్తున్నాం.
– డి. శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్‌  

మరిన్ని వార్తలు