తెలంగాణలో చలి పెరుగుతోంది.. మరింత పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు

31 Oct, 2022 01:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 32.2 డిగ్రీల సెల్సియస్‌ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు సగటున 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. సాధారణంగా నమోదు కావాల్సిన కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మరింత తక్కువగా నమోదవుతున్నాయి.

మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.1 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదైంది. హన్మకొండలో 4.8 డిగ్రీల సెల్సియస్, రామగుండంలో 3.3 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల రాక నేపథ్యంతో పాటు ఈశాన్య/ తూర్పు దిశల నుంచి రాష్ట్రానికి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగినట్లు వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు