డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల దందా! డీల్‌ కుదిరితే ఒకే.. లేదంటే..

19 Mar, 2022 10:01 IST|Sakshi

ఫార్మసీలో లోపాలంటూ వైద్యులపై బెదిరింపులు

ఉమ్మడిజిల్లాలో ఆకాశరామన్న ఉత్తరాలే ఫిర్యాదులుగా దూకుడు

ఆపరేషన్‌ థియేటర్లలోకి చొచ్చుకుపోతున్న అధికారులు

వైద్యుల జోలికొస్తే సహించేది లేదంటున్న ఐఎంఏ

‘మరో సందర్భంలో ఆపరేషన్‌ జరుగుతుండగా ఓ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నేరుగా తలుపులు తోసుకుంటూ లోనికివెళ్లాడు. మీ ఫార్మసీలో ఫార్మసిస్ట్‌ లేడు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీన్ని మూసేస్తాం. రేపు మీ ఆసుపత్రి గురించి మీడియాలో వస్తుంది’ అంటూ హెచ్చరికలు.

‘మీ ఫార్మసీలో ఎయిర్‌ కండిషన్‌ (ఏసీ) నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా పెట్టారు. మీ ఆసుపత్రిలో ఉన్న మందుల దుకాణాన్ని మూసేస్తున్నాం’ అంటూ పేషెంట్లను చెకప్‌ చేస్తున్న వైద్యునికి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ బెదిరింపు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలను, ప్రైవేటు వైద్యులను బెదిరిస్తున్న తీరు పై విధంగా ఉంది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల ఆగడాలు రోజురో జుకూ శృతి మించుతున్నాయి. ఫార్మసీల్లో తనిఖీల పేరిట ఏకంగా వైద్యులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఆసుపత్రి పరువు పోతుందని భయపెట్టి యాజమన్యాలు, వైద్యుల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు.

కొన్నినెలలుగా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న వీరి ఆగడాలకు అనేక ప్రైవేటు ఫార్మసీ, ఆసుపత్రి యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నా యి. ఫార్మసీని మూసేస్తారన్న విషయం లోకానికి తెలిస్తే.. ఆసుపత్రి ప్రతిష్ట బజారున పడుతుందన్న సున్నితమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కో యాజమాన్యం నుంచి రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు వాపోయాడు. ఇలా ఇప్పటిదాకా పదుల సంఖ్యలో ఆసుపత్రుల యజమానులను, వైద్యులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని సమాచారం.

ఆకాశ రామన్న లెటర్‌ ఆయుధంగా..!
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముందుగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఫార్మసీ షాపులు అటాచ్‌గా ఉన్న ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. 
►  ఉమ్మడి జిల్లాలో ఈ తరహాలో దాదాపు 600 వరకు ఆసుపత్రులు ఉన్నాయి. 
►   సదరు ఫార్మసీల్లో అనేక లోపాలు ఉన్నాయని, నిర్దేశిత ప్రమాణాల మేరకు మందులు లేవని, జనరిక్‌ మందులు విక్రయిస్తున్నారని, బ్రాండెడ్‌ పేరిట నకిలీ మెడిసిన్‌ అమ్ముతున్నారని, పీసీడీ మందులు, శాంపిల్‌ మందులు సేల్‌ చేస్తున్నారంటూ ఓ ఆకాశరామన్న ఉత్తరం వీరికి పోస్టు ద్వారా అందుతోంది. 

►   ఇది ఎవరు రాస్తున్నారో తెలియదు. ఇది మరునాడు వారి ఆఫీసుకు చేరగానే వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. 
►  వస్తూనే ఫార్మసీలోని లోపాలను ఎత్తిచూపుతారు. ఆ తరువాత దాని యజమానిని పిలిపించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి. 
►   కానీ.. వీరు ఇక్కడే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా రు. నేరుగా ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తున్న వైద్యుల వద్దకు వెళ్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని పిలిపించాలని, ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని, మీడియాలో వేయిస్తామంటూ నానా యాగీ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి యా జమాన్యం వారి లోపాలు బయటపడకుండా అడిగినకాడికి ఇచ్చి వారిని బయటికి పంపిస్తున్నారు. 

ఐఎంఏ జోక్యంతో దిగివచ్చిన వైనం..
ఇటీవల అన్ని అనుమతులు, నిబంధనలు పాటిస్తున్న దాదాపు 15 ఆసుపత్రుల్లోనూ ఇదే విధంగా డబ్బులు వసూలు చేయడం, బెదిరింపులకు దిగడంతో వైద్యులు తీవ్రంగా పరిగణించారు. ఈ విషయాన్ని నేరుగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) దృష్టికి తీసుకెళ్లారు. ఫార్మసీలు, ఆసుపత్రిలో లోపాలు ఉంటే దానికి ప్రైవేటు వైద్యులపై బెదిరింపులకు దిగడం, డబ్బులు కావాలని వేధించడం ఏంటని వాపోయారు. దీంతో ఐఎంఏ ఎలెక్టెడ్‌ ప్రెసిడెంట్‌ డా.బీఎన్‌రావు సదరు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నిలదీశారు. ఫార్మసీలో లోపాలు ఉంటే.. వైద్యులపై ప్రతాపం చూపడం.. డబ్బులు వసూలు చేయడం ఏంటని అడిగారు. 


వైద్యులను బెదిరిస్తే సహించేది లేదు
ఆసుపత్రుల్లో లోపాలు, ఫార్మసీల్లో లోపాలు ఉంటే నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి. వీటిపై సందేహాలుంటే సదరు యజమానులతో మాట్లాడాలి. అంతే తప్ప రోగులను పరీక్షిస్తున్న వైద్యుల గదుల్లోకి రావడం, ఆపరేషన్‌ థియేటర్‌లో ఆపరేషన్లు జరుగుతుండగా చొచ్చుకుపోవడాన్ని ఐఎంఏ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదు.
– డా.బీఎన్‌. రావు, ఐఎంఏ ఎలెక్టెడ్‌ ప్రెసిడెంట్‌  

దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
ఆసుపత్రి పేరు మీద ఉన్న సబ్సిడీ మీద వచ్చే మందులు ఇన్‌పేషెంట్లకే ఇవ్వాలి. వాళ్ల మెడికల్‌ షాపుల్లో విక్రయించకూడదు. ఇలాంటి అక్రమాలపై వైద్యులను ప్రశ్నించేందుకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు వీలుంది. నిలువ చేసేందుకు లైసెన్సు లేకుండా మందులు స్టోర్‌లో ఉంచడం నేరం. అలాంటి స్టోర్లను తనిఖీ చేసే అధికారం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఉంది. ఇవి కాకుండా ఓపీలో వైద్యులను, ఆపరేషన్‌ థియేటర్లలో వైద్యులను ఇబ్బంది పెట్టడం తప్పు. అలాంటి ఫిర్యాదులు ఇంతవరకూ రాలేదు. వస్తే  తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– విజయ్‌గోపాల్, అస్టిస్టెంట్‌ డైరెక్టర్, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 

మరిన్ని వార్తలు