‘ఫార్మా’లిటీస్‌ దందా! 

19 Oct, 2022 08:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొందరు ఔషధ నియంత్రణాధికారుల (డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల) దందా జోరుగా కొనసాగుతోంది. మందుల దుకాణాల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ దుకాణాలకు వెళ్లారంటే చాలు లోపాలను సరిచేయాల్సింది పోయి, వాటిని అడ్డంపెట్టుకొని అడ్డంగా తినేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదే అదనుగా కొన్ని ఔషధ దుకాణ దారులు కూడా నాసిరకం మందులు, అనుమతిలేని విక్ర యాలు, ప్రిస్కిప్షన్‌ లేకుండానే మందుల అమ్మకాలు చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

నియంత్రణ గాలికి..
దేశంలోనే ఫార్మా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. పలు దేశాలకు ఇక్కడి నుంచే మందులు ఎగుమతి అవుతున్నాయి. ముడిసరుకును ఉత్పత్తి చేసే ఔషధ సంస్థలు సైతం రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. అటు ఉత్పత్తి, ఇటు విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలను డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లే చూడాలి. కానీ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు లంచాలు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఔషధ నియంత్రణ గాల్లో దీపం చందంగా మారింది. దేశంలో 3.16 శాతం, తెలంగాణలో 2.90 శాతం ఔషధాలు నాసిరకమని జాతీయ ఔషధ సర్వే తేల్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే మందుల్లో 12.57 శాతం ఔషధాలకు నాణ్యతా ప్రమాణాలు కొరవడినట్లు వెల్లడించింది.

వేధిస్తున్న అధికారుల కొరత...
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 36 వేల మందుల దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి 100 మందుల దుకాణాలకు ఒక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలి. అంటే రాష్ట్రంలో దాదాపు 360 మంది అవసరం. మరోవైపు రాష్ట్రంలోని 560 ఔషధ ఉత్పత్తి సంస్థల తనిఖీకి మరో 25 మంది అధికారులు కావాలి. ఇలా మొత్తంగా 385 మంది నియంత్రణాధికారుల  అవసరం ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరైన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు 71 మంది మాత్రమే. ఇందులోనూ 18 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంటే 53 మందే ఉన్నారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల చేతుల్లో ఎక్కువ మందుల దుకాణాలు ఉండటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

కానరాని నిబంధనల అమలు...
వాస్తవానికి ఉత్పత్తి సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలపై అధికారులు తనిఖీలు చేయాలి. ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన లేబరేటరీల్లో వాటిని పరీక్షించాలి. ఫార్మసిస్టులకూ మందులను నిల్వ చేయడంపై శిక్షణ ఇవ్వాలి. అలాగే ఫార్మసిస్టుల సమక్షంలోనే మందులు విక్రయించాలి. కానీ రాష్ట్రంలో 70 శాతం మందుల దుకాణాల్లో ఫార్మసిస్టులు లేరని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. అలాగే డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా షెడ్యూల్‌ హెచ్, హెచ్‌1 మందులను అమ్మడానికి వీలు లేదు. ఆ మేరకు రికార్డులు కూడా నిర్వహించాలి. బిల్లుల నిర్వహణ ఉండాలి. గడువు ముగిసిన మందులను షాపుల్లో ఉంచరాదు. ఔషధ కంపెనీల ప్రతినిధులు ఇచ్చే శాంపిల్‌ మందులు, ప్రభుత్వాసుపత్రుల్లో సరఫరా చేసే ఔషధాలను అమ్మకూడదు. కానీ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల దందా, వారి కొరత కారణంగా చాలా ఔషధ దుకాణాల్లో ఆ నిబంధనలు అమలు కావడంలేదు. 

బదిలీలు బంద్‌!
ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 15 వేలకుపైగా మందుల దుకాణాలు ఉండగా ఇక్కడ 20 మందే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వారు జిల్లాలకు వెళ్లడానికి అయిష్టత చూపుతున్నారు. అలాగే జిల్లాల నుంచి బదిలీపై ఎవరైనా హైదరాబాద్‌ రాకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవానికి మూడేళ్లకోసారి బదిలీ జరగాల్సి ఉన్నా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఏడెనిమిదేళ్లుగా ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ నగరంలోనే పాతుకుపోయారు. 

మరిన్ని వార్తలు