దుబ్బాక ఎమ్మెల్యే కన్నుమూత‌

6 Aug, 2020 04:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. ఆయన మరణ వార్త జిల్లా, నియోజకవర్గ ప్రజలను విచారంలో ముంచింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన మృతిపట్ల టీఆర్‌ఎస్‌ నేతలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుములుకున్నాయి.

రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 2004 లో మొదటి సరిగా దుబ్బాక  నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2009లో ఓటమి అనంతరం 2014, .2019 ఎన్నికల్లో గెలుపొందారు. అంతకు ముందు  రామ లింగారెడ్డి వివిధ వార్తా పత్రికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా,  జహీరాబాద్, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి  ప్రాంతాల్లో పని చేశారు. జర్నలిస్ట్ నాయకుడిగా రాష్ట్రంలో  పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. నక్సలైట్‌ ఉద్యమంలోనూ పాల్గొని కొన్ని రోజుల పాటు పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతదేహాన్ని ఆయన స్వస్థలం చిట్టాపూర్‌కు తరలించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆత్మీయులు, రాజకీయ నాయకులు, అభిమానులు.. చిట్టాపూర్‌కు చేరుకుంటున్నారు. రామలింగారెడ్డి అకాల మరణంతో  చిట్టాపూర్ శోక సంద్రంగా మారింది. 

మరిన్ని వార్తలు