రాజమౌళన్నా.. కూర ప్రభాకర్‌ ఏం జేస్తుండు: సీఎం కేసీఆర్‌

31 Jul, 2021 02:38 IST|Sakshi
 సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న నిర్మాణ కమిటీ సభ్యులు  

ఆలయ ప్రారంభోత్సవంలో తప్పకుండా పాల్గొంటా: సీఎం కేసీఆర్‌ 

ప్రగతి భవన్‌కు వచ్చిన దుబ్బాక నాయకులు 

ఆత్మీయంగా పలకరించిన ముఖ్యమంత్రి 

సాక్షి, దుబ్బాక టౌన్‌: ‘దుబ్బాకకు రాక చాలా రోజులు అవుతోంది. మనోల్లంతా బాగున్నరా రాజమౌళన్నా.. కూర ప్రభాకర్‌ ఏం జేస్తుండు.. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బాలాజీ ఆలయ ప్రారంభోత్సవంలో తప్పకుండా పాల్గొంటా.. ఆ రోజు అందరినీ కలుస్తా..’అంటూ ఆహ్వాన పత్రిక అందజేయడానికి ప్రగతి భవన్‌కు వచ్చిన దుబ్బాక నాయకులతో సీఎం కేసీఆర్‌ ముచ్చటించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి దుబ్బాక బాలాజీ ఆలయ కమిటీ బాధ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆగస్టు 20న ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ చిత్రాలు చూశానని, చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. దుబ్బాక బాలాజీ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచుతుందని చెప్పారు. నిర్మాణం పూర్తయ్యాక చినజీయర్‌ స్వామితో కలసి ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకుందామని సీఎం వివరించారు. ఈ సందర్భంగా వారిని పేరుపేరున పలకరించడంతో పాటు దుబ్బాకలో తన చిన్ననాటి మిత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు వడ్లకొండ సుభద్ర శ్రీధర్, చింత రాజు, రొట్టె రాజమౌళి, మధు, కూర వేణుగోపాల్, శ్రీనివాస్‌ తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు