ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక

28 Oct, 2020 00:47 IST|Sakshi
అంజన్‌రావు ఇంట్లో డబ్బుల కట్టలు (పోలీసులు విడుదల చేసిన వీడియోలోని చిత్రం)

సిద్దిపేట ఘటనతో రాజుకున్న ఉపఎన్నిక రాజకీయం

టీఆర్‌ఎస్‌ బలప్రదర్శన.. తొగుటలో భారీ ర్యాలీ, యువజన సదస్సు

సంజయ్‌ను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళన

సాక్షి, సిద్దిపేట:దుబ్బాక రాజకీయం రసకందాయంలో పడింది. సిద్దిపేటలో సోమవారం జరిగిన నోట్ల కట్టల లొల్లి రాష్ట్ర్‌రవ్యాప్తంగా సంచలనం రేపింది. బీజేపీ– టీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉపఎన్నిక వేడి కాక పుట్టిస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రోద్బలంతో పోలీసులే డబ్బు తెచ్చిపెట్టి తమను ఇరికించే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. డబ్బులతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, కపట నాటకాలాడు తోందని టీఆర్‌ఎస్‌ ధ్వజమెత్తింది. మొత్తా నికి సోమవారం హైడ్రామాతో ఎవరికెంత మైలేజీ వచ్చిందనే లెక్కలు ఇరుపార్టీలు వేసుకుంటున్నాయి. సోషల్‌ మీడియాను వాడుకొని అనూహ్యంగా బీజేపీ లబ్ది పొందిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి జవాబుగా అన్నట్లు టీఆర్‌ఎస్‌ మంగళవారం బలప్రదర్శనకు దిగింది. దుబ్బాక నియోజకవర్గంలో తొగుటలో యువజన సదస్సు నిర్వహించి భారీగా జనసమీకరణ చేసింది అధికార పార్టీ. అదే విధంగా పోలీసుల తప్పేమీలేదని చెప్పు కొనేందుకు పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ సోదాలకు సంబంధించిన ఫుటేజీలు బయటపెట్టారు. మరోవైపు బీజేపీ కూడా తమ నాయకుడు బండి సంజయ్‌ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.

సోదాల ఫుటేజీ విడుదల
సిద్దిపేటలో సోమవారం అసలేం జరిగిం దనే విషయాన్ని తెలిపేందుకు మంగళవారం  సిద్ది పేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంజన్‌ రావు ఇంటిని సోదా చేసిన తీరు, అక్కడ డబ్బులు దొరకడం, అంజన్‌రావు కుటంబసభ్యుల సమక్షంలో లెక్కించడం, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఆరాతీయడానికి సంబంధించిన వీడియో పుటేజీలను మీడియాకు అందజేశారు. గతంలో సోదాలు చేస్తే ప్రజలు సహకరించారని, సోమవారం వందలాది మంది బీజేపీ కార్యకర్తలు వచ్చి శాంతిభద్రతలకు భంగం కలిగించారని ఆరోపించారు.

దొంగలకు సద్దికట్టేందుకు వచ్చారు: హరీశ్‌
సిద్దిపేటలోని లెక్చలర్స్‌ కాలనీలోని అంజన్‌రావు ఇంటిలో దొరికిన రూ.18.67 లక్షల రూపాయలను... పోలీసులే తెచ్చి పెట్టి సోదాలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో వందలాదిగా యువకులు అంజన్‌రావు ఇంటి వద్దకు వచ్చి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేసిన విషయం విది తమే. యువత బీజేపీ వైపు ఉందనే సంకేతాలు పోతాయని భావించిన టీఆర్‌ఎస్‌ దీనికి విరుగుడుగా.. తొగుట మండలంలో వేలాది మంది యువకులతో మంగళవారం భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించింది. తొగుట గాంధీ సెంటర్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తూ కమలనాథులపై విరుచుకుపడ్డారు. బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని, అడ్డంగా దొరికినా బుకాయిస్తోందని అన్నారు. ఎన్నడూ కానరాని కిషన్‌రెడ్డి దొంగలకు సద్దికట్టేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కి గతంలో విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు అక్రమంగా డబ్బులు పంచిపెట్టేందుకు సిద్ధమైన రఘునందన్‌రావుకు మద్దతు ఇచ్చేందుకు రావడం శోచనీయం అన్నారు.  

బీజేపీ ఆందోళనలు..
సిద్దిపేట ఘటనతో నెలకొన్న ఉద్రిక్తతలు రెండోరోజూ కొనసాగాయి. సంజయ్‌ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. నినాదాలు చేశారు. ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోహెడ, చేర్యాల, హుస్నాబాద్, సిద్దిపేట, మద్దూరు, కొమురవెల్లి ప్రధాన రహదారులపై బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. పోలీస్‌ అధికారులు టీఆర్‌ఎస్‌కు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల బీజేపీ కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి. పలువురిని అరెస్టు చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా