మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..కారణం అదే!

7 Jan, 2021 08:03 IST|Sakshi

కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పెరిగిన ఆక్యుపెన్సీ

ఒక్క రోజులో 417 మందికి కరోనా పాజిటివ్

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్‌ తగ్గినట్లే తగ్గి తిరిగి విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి కొత్త సంవత్సరం వేడుకల తర్వాత కేసుల నమోదులో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 1న 293 కేసులు నమోదు కాగా, 2న 394కు చేరుకున్నాయి. తర్వాత 3వ తేదీకి 238కి తగ్గగా, తిరిగి 4వ తేదీకి 253, 5వ తేదీకి 417కు చేరాయి. దీంతో వైద్యారోగ్యశాఖ వర్గాలు పరిస్థితిపైసమీక్షిస్తున్నాయి. న్యూ ఇయర్‌ వేడుకల్లో అనేక మంది గుమికూడటం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నట్లు వైద్య వర్గాలు విశ్లేషించాయి. బయట పార్టీలు జరగకపోయినా కొన్ని కుటుంబాలు ఒకచోటకు చేరి వేడుకలు నిర్వహించడం, అలాగే కొన్ని శుభకార్యాలు జరగడం, చలి పెరగడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

మరోవైపు గత మూడు, నాలుగు వారాల్లో నగరంలోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా రోగుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో కొత్త రోగుల సంఖ్య అంతకుముందు కంటే కొత్త ఏడాదిలో 35 నుంచి 40 వరకు పెరిగినట్లు ఒక ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారండిసెంబర్‌ 1 నుంచి సర్కారు ఆసుపత్రుల్లో బెడ్‌ ఆక్యుపెన్సీ స్థిరంగా ఉంది. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. వీటిలో 19.32 శాతం పడకలు భర్తీ అయ్యాయి. అంటే 7,769 పడకలకు గాను 1,501 కరోనా రోగులతో నిండాయి. 

రికవరీ రేటు 97.73శాతం...
రాష్ట్రంలో మంగళవారం 43,318 శాంపిళ్లు పరిశీలించగా 417 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే 472 మంది కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు బుధవారం ఉదయం కరోనా బులిటెన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 71,04,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 2,88,410 మందికి పాజిటివ్‌గా సోకింది. మొత్తం 2,81,872 మంది కోలుకోగా, మరణాల సంఖ్య 1,556 కు చేరింది. రికవరీ రేటు 97.73 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌కేసులు 4,982 ఉన్నాయి. అందులో 2,748 మంది ఇళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఐసోలేషన్లో ఉన్నారు. 

ఏపీలో 289 పాజిటివ్‌ కేసులు
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 51,207 కరోనాటెస్టులు చేయగా, 289 పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయి. కోవిడ్‌ వల్ల ముగ్గురు మృతి చెందగా, ఒకే రోజు 428 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,21,05,121 టెస్టులు చేయగా 8,83,876 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,73,855 మంది కోలుకోగా 2,896 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 7,125 మంది మృతి చెందారు.

పరిస్థితి నియంత్రణలోనే..
కొత్త సంవత్సర వేడుకల్లో జనం గుమికూడడం, పార్టీలు చేసుకోవడం, ఇతరత్రా శుభకార్యాల వల్ల కేసుల్లో కాస్తంత పెరుగుదల కనిపించింది. అయితే ఆందోళన అవసరం లేదు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది. వారం, పది రోజుల్లో మళ్లీ సాధారణ వాతావరణం నెలకొంటుంది. అయితే ప్రజలు కోవిడ్‌ జాగ్రత్తలు తప్పక పాటించాలి.      
 – డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు 

మరిన్ని వార్తలు