కరోనా రోగికి వరం: ‘నిశ్శబ్దం’ సినిమా సూత్రం

8 Oct, 2020 09:06 IST|Sakshi
 గాంధీ ఆస్పత్రి ఎదుట డిశ్చార్జి పేపర్‌ చూపిస్తున్న రామచంద్రన్‌  

సాక్షి, గాంధీ ఆస్పత్రి/హైదరాబాద్‌: అతడు బయటి వ్యక్తులతో మాట్లాడలేడు.. ఏ అవసరం ఉన్నా కుటుంబ సభ్యులు వివరిస్తారు.. కానీ అతడు కరోనా బారిన పడ్డాడు. మాటలు రాకపోవడంతో వైద్యులతో మాట్లాడలేడు. వైద్యులు చెప్పేది వినబడదు. సరిగ్గా చెప్పాలంటే ఇటీవల విడుదలైన ‘నిశ్శబ్దం’ సినిమాలోని అనుష్కలా అన్నమాట. సినిమాలో అనుష్క టెక్నిక్‌నే వినియోగించి ప్రాణాంతకమైన కరోనా వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు.      

  • హైదరాబాద్‌ మణికొండకు చెందిన రామచంద్రన్‌(45) దివ్యాంగుడు. మాటలురావు.. వినబడదు. కరోనా పాజిటివ్‌ రావడంతో గతనెల 27వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు.  
  • రోగి సహాయకులకు అనుమతి లేకపోవడంతో రామచంద్రన్‌ ఒక్కడే వార్డులో అడ్మిట్‌ అయ్యాడు. అతడు మాట్లాడలేక పోవడం, చెప్పినా వినిపించకపోవడంతో అతడు ఇబ్బందులు పడ్డాడు.  
  • అతడి బదిర భాష వైద్యులకు అర్థం కాలేదు. మనసుంటే మార్గం ఉంటుందని భావించిన వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలను హావభావాలు, సంజ్ఞల ద్వారా వివరించారు.  
  • మరికొన్ని విషయాలను రోగి సెల్‌ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ చాట్‌ ద్వారా చెప్పారు. దీంతో వైద్యులు, రోగి మధ్య కమ్యూనికేషన్‌ కొంతమేర మెరుగైంది.  
  • శానిటేషన్, పేషెంట్‌ కేర్‌ టేకర్లు, వార్డ్‌బాయ్స్‌ల వద్దకు వచ్చేసరికి కమ్యూనికేషన్‌ సమస్య మొదలైంది. ఇటీవల విడుదలైన నిశ్శబ్దం సినిమాలో అనుష్క పాటించిన చిట్కాను ఇక్కడ వినియోగించారు.  
  • బాధితుడు తన మొబైల్‌లో ఇంగ్లిష్‌లో టైప్‌ చేస్తే, తెలుగులో బయటకు వినిపించే యాప్స్‌ను వినియోగించడంతో సమస్య పరిష్కారమైంది. రామచంద్రన్‌ పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు.  
  • తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు, నోడల్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌రెడ్డి, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ వినయ్‌శేఖర్‌తో పాటు వైద్యులు, సిబ్బందికి రామచంద్రన్, సోదరుడు రామానుజన్‌లు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వార్తలు