భాగ్యనగరం మెడలో మరో మణిహారం

2 Sep, 2020 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు వంతెనను నిర్మిస్తోంది. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ తీగల వంతెనతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గనున్నది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ఈ వంతెన అందాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అతి సుందరమైన ఈ కట్టడం నగర ప్రజలను మంత్రముగ్ధులను చేస్తోంది. (‘కేబుల్‌ వంతెన’.. పర్యాటక ఆకర్షణ!)

దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి హైదరాబాద్‌ మొట్టమొదటి హ్యాంగింగ్‌ బ్రిడ్జిగా పేరొందడంతోపాటు పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. దీనికి సంబంధించిన వీడియోను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ షేర్‌ చేశారు. ‘దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమైన అంశం. మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో 60 శాతానికి పైగా నిధులను ఖర్చు చేస్తోంది. వంతెనను నిర్మించిన ఇంజనీర్లకు ధన్యవాదాలు.’ అని పేర్కొన్నారు. ఇక రంగురంగుల విద్యుత్‌ కాంతులతో జిగేలుమంటున్న ఈ వీడియో ప్రస్తుతం నగర ప్రజలను ఆకర్షిస్తోంది.

మరిన్ని వార్తలు