నగరవాసులు పల్లెబాట..

22 Oct, 2020 03:44 IST|Sakshi
సొంతూళ్లకు వెళ్లేందుకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చిన ప్రజలు

సద్దుల బతుకమ్మ, దసరా కోసం సొంతూళ్లకు పయనం

తెరిపినిచ్చిన వానలతో పెరిగిన రాకపోకలు

తెలంగాణకే పరిమితమైన ప్రత్యేక బస్సులు

అరకొరగానే రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: నగరవాసిని వాన పొమ్మంది.. పల్లె రమ్మంది.. ఇక్కడుంటే దండగ.. అక్కడైతే పండుగ.. అని పల్లె మూలాలున్న నగరవాసులు భావిస్తున్నారు. వారం, పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బెంబేలెత్తిన నగరవాసులు బుధవారం పల్లెబాట పట్టారు. బతుకమ్మ, దసరా వేడుకల కోసం సొంతూరుకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో రద్దీ కనిపించింది. కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలకుపైగా స్తంభించిన జనజీవనం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న తరుణంలో భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. వరదలతో కాలనీ, బస్తీలు నీటమునిగాయి.

బుధవారం తెల్లవారుజామున సైతం కురిసిన వర్షం ఉదయం తగ్గుముఖం పట్టింది. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి ఉప్పల్, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖంపడితే మరో రెండు, మూడు రోజులపాటు వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించారు. 

అరకొర రైళ్లే...
ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోవిడ్‌ కారణంగా రెగ్యులర్‌ రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి 22 ప్రత్యేక రైళ్లు మాత్రమే వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 15 రైళ్లు ఏర్పాటు చేశారు. కానీ, డిమాండ్‌ ఎక్కువగా ఉండే విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాలకు ఉన్న రైళ్లు చాలా తక్కువ. ఇప్పటికే అన్ని రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు భారీగా నమోదైంది. కొన్ని రైళ్లలో సంక్రాంతి వరకు కూడా రిజర్వేషన్‌లు బుక్‌ అయ్యాయి. ఒకవైపు రైళ్ల కొరత, మరోవైపు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్‌ బస్సులు, కార్లు తదితర వాహనాలకు గిరాకీ భారీగా పెరిగింది. ఇదే సమయంలో చార్జీల భారం సైతం రెట్టింపైంది. 

ప్రైవేట్‌ బస్సుల దోపిడీ
తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్ధరించకపోవడంతో ప్రైవేట్‌ ఆపరేటర్లు పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ, విశాఖ, కడప, చిత్తూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతాల ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు సాధారణరోజుల్లో రూ.350 వరకు ఉంటే ఇప్పుడు రూ.550కిపైగా చార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సాధారణ రోజుల్లో కాకినాడ, విశాఖ వంటి దూరప్రాంతాలకు ఏసీ బస్సుల్లో రూ.900 వరకు చార్జీ ఉంటుంది. ఇప్పుడు అది రూ.1,650 దాటింది.  

మరిన్ని వార్తలు