సీబీఐ ఎలా దర్యాప్తు  చేస్తుంది?

18 Feb, 2023 03:43 IST|Sakshi

బీజేపీపై ఆరోపణలుంటే అది సాధ్యమేనా?

తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసుల తరఫు సీనియర్‌ న్యాయవాది దవే ప్రశ్న

సీబీఐను కేంద్రం నియంత్రిస్తోందన్న దవే 

ఈ కేసులో సీఎంనూ నిందించాల్సిన అవసరం ఉందన్న బీజేపీ తరఫు న్యాయవాది జెఠ్మలానీ 

తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఎలా చేస్తుందని రాష్ట్ర పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రశ్నించారు. సీబీఐకి కేసు బదిలీ చేయడం వల్ల న్యాయం లభించదని పేర్కొన్నారు. సీబీఐను కేంద్రం నియంత్రిస్తోందని దవే ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

తొలుత దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో జాబితాలో కేసు చేర్చారని, న్యాయమూర్తులు చదివారో లేదోనని గుర్తుచేశారు. పిటిషన్‌ చదవలేకపోయామని ధర్మాసనం పేర్కొనగా... విచారణ శుక్రవారానికి వాయిదా వేయాలని కోరిన దవే పది రోజుల క్రితమే జాబితాలో చేర్చాలని సీజేఐ చెప్పినప్పటికీ రిజిస్ట్రీ రాత్రి వరకూ జాబితాలో చేర్చకపోవడం దురదృష్టకరమన్నారు.

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని గతంలో నమోదు చేసిన పిటిషన్లపై ప్రశ్నించింది. ‘‘తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు చాలా తీవ్రమైనది. వరసగా స్టే ఉత్తర్వులు, బెయిలు ఉత్తర్వులు వల్ల విచారణ కొంచెం కూడా ముందుకు సాగడం లేదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఈ కేసులో తెలంగాణ హైకోర్టులోనూ వాదనలు వినిపించా.

బీజేపీ పిటిషన్‌ను సింగిల్‌ బెంచ్‌ తొలుత విచారించగా.. విచారణార్హత లేదని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది’’అని దవే తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి సిట్‌ వేశారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను సింగిల్‌ బెంచ్‌ రద్దు చేసిందని దవే తెలిపారు. సిట్‌ ఏర్పాటు చేసింది సింగిల్‌ బెంచ్‌ కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, సింగిల్‌ బెంచ్‌ పర్యవేక్షిస్తుందని డివిజన్‌ బెంచ్‌ పేర్కొందని ఇరుపక్షాల న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు.

సీఎంను తొలుత నిందించాలి.. మహేశ్‌ జెఠ్మలానీ 
బీజేపీ తరఫు సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ.. సిట్‌ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉందన్నారు. కేసు దర్యాప్తు రికార్డులు మీడియాకు విడుదల చేసినందుకు తెలంగాణ సీఎంను తొలుత నిందించాల్సి ఉందన్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసుల స్వతంత్రత పై అనుమానం వస్తోందని తెలిపారు. మీడియాకే కాదు న్యాయమూర్తులకు పంపారని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు వివరాలన్నీ మీడియాకు లీక్‌ అవుతున్నాయని దవే ఆరోపించారు.

ఇలా చేయడం ఎవరికీ తగదని జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని, ప్రజాస్వామ్యాన్ని కోర్టులు మాత్రమే కాపాడగలవని దవే పేర్కొన్నారు. ‘‘బీజేపీకి వ్యతిరేకంగా ఆరోపణలుండగా సీబీఐ చేతికి దర్యాప్తు ఎలా ఇస్తారు?. ఇది ట్రాప్‌ కేసు. పలు సాక్ష్యాలున్నాయి. అవినీతి నిరోధక కేసుల్లో ట్రాప్‌ పద్ధతి సరైందని సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది. ఎమ్మెల్యేలతో ఏం చర్చించారో ఐదు గంటల రికార్డింగు ఉంది. ఫోన్, వాట్సాప్‌ సంభాషణలూ ఉన్నాయి.

సీబీఐకి దర్యాప్తు అప్పగించాల్సిన అవసరం లేదు. కేసులో వాదనలకు ఎక్కువ సమయం కావాలి’’అని దుష్యంత్‌ దవే వాదన ముగించారు. ధర్మాసనం సమాలోచనల్లో ఉండగా.. ‘‘వేధించొద్దని సీబీఐకి సూచించండి’’అని జెఠ్మలానీని ఉద్దేశించి దవే చమత్కరించారు. సీబీఐని బీజేపీ ఏమీ నియంత్రించడం లేదని జెఠ్మలానీ స్పష్టం చేశారు.

అనంతరం, ఈ నెల 27కు విచారణ వాయిదా వేస్తున్నామని, ఆరోజు అన్ని కేసుల విచారణ తర్వాత చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు మాట్లాడుతుండగా... ఎవరి తరఫున హాజరయ్యారని ధర్మాసనం ప్రశ్నించింది.

ఫిర్యాదు చేసి ఇరుపక్షాల మధ్య చిక్కుకున్న ఎమ్మెల్యే తరఫు అని సమాధానమిచ్చారు. ఏమైందని ధర్మాసనం ప్రశ్నించగా.. తన క్లయింటును ఈడీ వేధిస్తోందని శేషాద్రి నాయుడు తెలిపారు.   

మరిన్ని వార్తలు