Dussehra 2022: కాసులు కురిపించిన దసరా

7 Oct, 2022 08:28 IST|Sakshi

ఆర్టీసీ, రైల్వేకు భారీ ఆదాయం 

రెట్టింపు చార్జీలతో ప్రైవేట్‌ బస్సులకు ‘పండగ’ 

దక్షిణమధ్య రైల్వేకు రూ.45 కోట్లు 

ఆర్టీసీకి సమకూరిన రూ.15 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా రవాణా సంస్థలకు దసరా పండగ కాసులు కురిపించింది. రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దసరా సందర్భంగా నగరం నుంచి సుమారు 30 లక్షల మందికిపైగా సొంతూళ్లకు వెళ్లినట్లు అంచనా. వీరిలో 25 శాతం మంది సొంత వాహనాల్లో వెళ్లగా.. మిగతా 75 శాతం ఆర్టీసీ బస్సులు, రైళ్లలో బయలుదేరారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు  ప్రైవేట్‌ బస్సుల్లో ఎక్కువగా వెళ్లారు.

ప్రయాణికుల రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే  సుమారు 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొన్ని రైళ్లలో సాధారణ బోగీల సంఖ్యను పెంచింది. మరికొన్ని రైళ్లకు స్లీపర్‌ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4600 అదనపు బస్సులకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు  సాధారణ చార్జీలపైనే అదనపు బస్సులను నడపడంతో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది.  

ఆర్టీసీకి ఆదరణ..  
సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఎక్కువ శాతం నగరవాసులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులే అందుబాటులో ఉండడంతో ఆర్టీసీ సైతం విస్తృత ఏర్పాట్లు  చేసింది. గతేడాది దసరాకు రూ.10 కోట్లు సమకూరగా.. ఈసారి సుమారు  రూ.15 కోట్లకుపైగా లభించినట్లు ఓ అధికారి తెలిపారు. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి  ప్రతి రోజు నడిచే  3500 బస్సులతో పాటు రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. నగరవాసులు పూర్తిస్థాయిలో బస్సులను వినియోగించుకుంటే ఆర్టీసీకి మరింత ఆదాయం లభించేదని, ఎక్కువ శాతం సొంత వాహనాలు, టాటాఏస్‌లు, అద్దె కార్లకు  ప్రాధాన్యమిచ్చారని  అధికారులు భావిస్తున్నారు. బైక్‌లపై కూడా పెద్ద ఎత్తున వెళ్లినట్లు సమచారం.  

పండగ చేసుకున్న ప్రైవేట్‌ యాజమాన్యాలు..  
హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే  ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. పండగ రద్దీని సొమ్ము చేసుకున్నారు. టూరిస్టు బస్సులుగా నమోదైనవి కూడా స్టేజీ క్యారేజీలుగా రాకపోకలు సాగించాయి. మినీ బస్సులు, ట్రావెల్స్‌ కార్లు సైతం రెండు రాష్ట్రాల మధ్య పరుగులు తీశాయి.   

దక్షిణమధ్య రైల్వేకు..   
దక్షిణమధ్య రైల్వేకు సుమారు రూ.45 కోట్ల వరకు లభించినట్లు అంచనా. దసరా సందర్భంగా వివిధ మార్గాల్లో  ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. అన్ని రూట్లలోను ప్రయాణికుల రద్దీ పెరిగింది. అన్ని ప్రధాన రైళ్లలో  వెయిటింగ్‌లిస్టు  250 దాటిపోయింది. దీంతో రద్దీ ఉన్న మార్గాల్లో  అదనపు రైళ్లతో పాటు అదనపు బోగీలను ఏర్పాటు చేయడం వల్ల కొంత మేరకు ఊరట లభించింది. కోవిడ్‌కు ముందు.. అంటే  రెండేళ్ల క్రితం నాటి ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చాలా తక్కువే లభించినట్లు అధికారులు చెప్పారు.   

మరిన్ని వార్తలు