తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి! 

24 Sep, 2022 04:29 IST|Sakshi

రేపట్నుంచి గురుకులాలకు దసరా సెలవులు 

తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వస్తేనే పిల్లలను అప్పగించాలని సొసైటీల నిర్ణయం 

స్నేహితులు, తోబుట్టువులకు సైతం అనుమతిచ్చేది లేదని స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకులాల్లో దసరా సెలవుల హడావుడి ప్రారంభమైంది. ఈనెల 25 నుంచి వచ్చే నెల 9 వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో పిల్లలంతా వారి తల్లిదండ్రులతో గడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థులను ఇళ్లకు పంపించేందుకు గురుకుల సొసైటీలు కొన్ని షరతులు విధించాయి.

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గురుకుల సొసైటీలు.. ప్రిన్సిపాళ్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశాయి. పిల్లలను గురుకులం నుంచి ఇంటికి పంపాలంటే తప్పకుండా ఆ విద్యార్థి తల్లి లేదా తండ్రి లేకుంటే సంరక్షకుడు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అలా వస్తేనే విద్యార్థులను ఇంటికి అనుమతించాలని గురుకుల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి. స్నేహితులు, తోబుట్టువులు, ఇతర పరిచయస్తులతో పిల్లలను ఇంటికి అనుమతించవద్దని తేల్చిచెప్పాయి. 

ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. 
విద్యార్థులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కాకుండా ఇతరులకు అప్పగిస్తే తలెత్తే పరిణామాలకు ప్రిన్సిపాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుందని సొసైటీ కార్యదర్శులు స్పష్టం చేశారు. బాలికల విషయంలో మరింత కఠినంగా నిబంధనలు పాటించాలని సూచించారు. పిల్లలను అప్పజెప్పే సమయంలో తల్లిదండ్రులు/సంరక్షకులు వచ్చినప్పటికీ వారు సరైన వ్యక్తులేనా అనే విషయాన్ని ధ్రువీకరించుకుని రిజిస్టర్‌లో ఎంట్రీ చేయాలని స్పష్టం చేశారు. దీంతో పిల్లల అప్పగింతకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుందని చెపుతున్నారు.

తల్లిదండ్రులు సైతం కాస్త ఓర్పుతో ఉండాలని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించే సమయంలో విద్యార్థి చదువు గురించి సైతం వివరించాలని స్పష్టం చేయడంతో టీచర్లు ప్రోగ్రెస్‌ కార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, సెలవుల అనంతరం కూడా విద్యార్థులు తిరిగి వచ్చే సమయంలో వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలని, వెంట తెచ్చుకున్న సరుకులు, సామగ్రిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని సొసైటీ కార్యదర్శులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు