Post Covid Complications: కరోనానంతరం.. తప్పని తిప్పలు.. పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడి

11 Apr, 2022 01:28 IST|Sakshi

దీర్ఘకాలం పాటు డీవీటీ, పల్మనరీ ఎంబాలిజం, బ్లీడింగ్‌ సమస్యలు 

‘మైల్డ్‌ కరోనా’, ఆసుపత్రుల్లో చేరని కేసుల్లోనూ లక్షణాలు 

స్వీడన్‌ యుమియా విశ్వవిద్యాలయం పరిశోధనల్లో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌తో ముడిపడిన దీర్ఘకాలిక ప్రభావాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వల్ప లక్షణాలతో కరోనా వచ్చినవారిలోనూ కాళ్లలో రక్తం గడ్డకట్టడం–డీప్‌ వీన్‌ త్రాంబసిస్‌ (డీవీటీ), ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబాలిజిమ్‌), శరీరంలోపల రక్తస్రావాల(బ్లీడింగ్‌) వంటివి రెండు నుంచి ఆరు నెలల దాకా సంభవించే అవకాశమున్నట్టు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మైల్డ్‌ లక్షణాలతో, ఆసుపత్రుల్లో చేరని కేసుల్లో కూడా ఈ లక్షణాలు ఉంటున్నాయని స్వీడన్‌ యుమియా విశ్వవిద్యాలయ పరిశోధనల్లో సైతం వెల్లడైంది.  

ఇదీ సమస్య... 
కోవిడ్‌ కారణంగా రోగుల్లో రక్తం చిక్కబడడం పెరిగింది. వైరస్‌ తగ్గాక కొన్నిరోజుల దాకా రక్తం గడ్డకట్టడం కొనసాగుతుండంతో ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాలు మూసుకుపోతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిపై ఈ ప్రభావం మరింత పెరిగి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి తీస్తోంది. కరోనా నుంచి కోలుకునే క్రమంలో, ఆ తర్వాతా.. ఏ సందర్భంలోనైనా వైరస్‌ కారణంగా గుండె ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. డీవీటీ, పల్మనరీ ఎంబాలిజం, తదితర అంశాలపై నిమ్స్‌ కార్డియాలజీ ప్రొఫెసర్‌ డా. ఓరుగంటి సాయి సతీష్, యశోద చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డా. హరికిషన్‌ గోనుగుంట్ల తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు. 

రక్తం గడ్డకట్టే లక్షణాలు పెరుగుతున్నాయి 
పోస్ట్‌ కోవిడ్‌ చికిత్సకు వచ్చిన పేషెంట్లలో డీవీటీ, పల్మనరీ ఎంబాలిజం లక్షణాలు కనిపించాయి. వైరస్‌ పూర్తిగా తగ్గిపోయినా అది శరీరంలోని అవయవాలపై చూపిన ప్రభావం కొనసాగుతోంది. రక్తనాళాలపై ఎక్కువ కాలం ఇది కొనసాగడం వల్ల రక్తం గడ్డకట్టే లక్షణం ఉంంటోంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ఏ రక్తనాళాల్లోనైనా రక్త గడ్డకట్టొచ్చు. అంతవరకు గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలి పోయే ఘటనలు పెరుగుతున్నాయి. గుండె అత్యంత వేగంగా కొట్టుకుని, గుండె నుంచి మెదడుకు రక్తప్రసారం ఆగిపోతే నిముషాల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. కోవిడ్‌ నుంచి కోలుకున్నా... డయాబెటిస్, బీపీ సమస్యలున్నవారు, స్మోకింగ్, ఆల్కహాల్‌ అలవాటున్నవారు, కుటుంబంలో గుండెజబ్బులున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్‌లు చేయించుకోవాలి. 
– డా. ఓరుగంటి సాయి సతీశ్, ప్రొఫెసర్‌ కార్డియాలజీ, హెడ్‌ యూనిట్‌ 1, నిమ్స్‌  

పల్మనరీ యాంజియోగ్రామ్‌తో గుర్తించొచ్చు
కాలి నొప్పులు, వాపు, పిక్కల్లో నొప్పులు డీవీటీ లక్షణాలు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గినపుడు స్వల్పంగా రక్తం పడడం, గుండె వేగంగా కొట్టుకోవడం, దగ్గు, కళ్లు తిరిగి పడిపోవడం వంటివి ‘పల్మనరీ ఎంబాలిజం’ ప్రధాన లక్షణాలు. కరోనా నుంచి కోలుకున్నాక మూడు నెలలు దాటినా సమస్యలు తగ్గని వారు దీని బాధితులుగా భావించాలి. ఊబకాయులు, ఎక్కువకాలం ఆసుపత్రుల్లో ఉండి వచ్చిన వారికి డీవీటీ, పల్మనరీ ఎంబాలిజం రావడానికి అవకాశం ఎక్కువ. వీటిని గుర్తించడానికి ‘సీటీ పల్మనరీ ఆంజియోగ్రామ్‌’చేయాలి.    
 – డా.హరికిషన్‌ గోనుగుంట్ల, చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి  

మరిన్ని వార్తలు