Telangana Eamcet 2021: టీఎస్‌ ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

4 Aug, 2021 11:21 IST|Sakshi

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ 

మొత్తం 2.51 లక్షల మంది దరఖాస్తు  

కరోనా నేపథ్యంలో ప్రతి విద్యార్థి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. 4, 5, 6, 9, 10వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్‌ విద్యార్థుల కోసం టెస్ట్‌లు ఉంటాయి. ఈసారి హాల్‌టికెట్‌తో పాటు పరీక్షాకేంద్రం రూట్‌మ్యాప్‌ ఇచ్చారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులను గంటంపావు ముందు నుంచి పరీక్షాహాల్‌లోకి అనుమతిస్తారు.
 
కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి.. 

కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్‌ డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు వంటివి ఉన్నవారికి ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. బాల్‌ పాయింట్‌ పెన్, హాల్‌టికెట్‌ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. జర్కిన్లు వేసుకొని రాకూడదు. భౌతికదూరం ప్రకారం ఆన్‌ లైన్‌లో పరీక్ష ఉంటుంది.

ఎంసెట్‌ మార్కులు 160 కాగా జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల అర్హతకు 40 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కు ఉండదు. బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. పరీక్షాపత్రం ఇంగ్లిషు–తెలుగు, ఇంగ్లిష్‌–ఉర్దూ, ఇంగ్లిష్‌లలో ఉంటుంది. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక కేటగిరీ భాషల్లో పరీక్షాపత్రం ఇస్తారు.  

మరిన్ని వార్తలు