19 వేల సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్‌ 

15 Aug, 2023 04:07 IST|Sakshi

సీఎస్‌ఈ బ్రాంచీలోనూ మిగిలిన 3 వేల సీట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ సీట్లు ఇంకా 19,049 మిగిలాయి. ఆదివారం మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ లెక్క తేలినట్టు సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ సీట్లు 3,034 వరకూ ఉన్నాయి. ఈసారి సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్‌ సీట్లను అన్ని కాలేజీలు ముందే భారీగా తగ్గించుకున్నాయి. ఈ బ్రాంచీల్లో మొత్తం 7 వేల సీట్లకు కోత పడింది. ఈ మేరకు కంప్యూటర్‌ సైన్స్‌ దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు పెరిగాయి. ఇవి కాకుండా మరో 7 వేల వరకూ కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత బ్రాంచీల్లో సీట్లు పెరిగాయి.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్‌ కోటా కింద 83,766 ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటే, ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులే 56,811 ఉన్నాయి. ఈ విధంగా కంప్యూటర్‌ బ్రాంచీల్లో సీట్లు పెరగడంతో టాప్‌ 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అంతగా పేరులేని, గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో మాత్రం కంప్యూటర్‌ కోర్సుల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాకల్స్, సివిల్, మెకానికల్‌ బ్రాంచీల్లో సీట్లు తక్కువే (కాలేజీలు తగ్గించుకోవడం వల్ల) ఉన్నప్పటికీ, చివరకు వాటిల్లోనూ భారీగా సీట్లు మిగిలాయి. ఇలా మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.  

మరిన్ని వార్తలు