సిద్దిపేటలో వీరుడి గుడి.. ఎలా ఉందో చూడండి

8 May, 2021 09:19 IST|Sakshi

∙భోగేశ్వరాలయం సమీపంలో లభ్యమైన శిలలు 

∙10, 11వ శతాబ్దాలనాటి ఆహార్యంతో ఉన్న వీరుని విగ్రహం 

∙గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు 

సాక్షి, సిద్దిపేట: వీరునికి గుడి కట్టడం అరుదుగా కనిపిస్తుంది. అది సిద్దిపేటలో కనిపించడం విశేషం. రాజుల చరిత్రకు సమాంతరంగా ఉంటుంది యుద్ధవీరుల చరిత్ర. పూర్వం ఊరిని కాపాడటానికి సొంత వీరులుండేవారు. వారు ఆ ఊళ్లలోని మహిళలు, పిల్లలు, పశువులు, సంపదను కాపాడటానికి దొంగలు, ఇతర రాజ్యాల సైనికులు, క్రూర జంతువులతోనైనా ప్రాణాలకు తెగించి పోరాడేవారు. ఈ పోరులో అమరులైన ఆ వీరుల పేరిట గ్రామస్తులు, పాలకులు నిలిపిన స్మారక శిలలే వీరగల్లులు. పట్టణంలోని భోగేశ్వరాలయం సమీప పొలాల్లో ఈ శిలలు కన్పించాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు అహోబిలం కర్ణాకర్, సామలేటి మహేశ్‌ వాటిని పరిశీలించారు. వీటిలో ఆత్మాహుతి శిలలెక్కువగా ఉన్నట్లు తేల్చారు. యుద్ధం చేసి మరణించిన వీరుల శిలలూ ఉన్నట్లు తెలిపారు. ఇటీవల గుడి పక్కన పొలాల్లో పశువులను కట్టేసే చోట నాలుగు రాతిస్తంభాల నడుమ భూమిలోపలికి నడుము వరకు మునిగివున్న వీరుని శిల్పం కనిపించింది. ఆ నాలుగు స్తంభాలు వీరుని గుడి కోసం పాతినవే కావడం గమనార్హం. ఇక్కడ గుర్తించిన రాచవీరునికి తలపై సిగ కుడివైపుకు కట్టి వుంది. చెవులకు పెద్దకుండలాలున్నాయి. వీరుని మెడలో రత్నాలు పొదిగిన హారాలున్నాయి. తలమీద రాచహోదాను తెలిపే ఛత్రం (గొడుగు) వుంది. పెద్దకళ్లు, తిప్పిన మీసాలు, దీర్ఘచతురస్రాకారపు ముఖంతో కనిపిస్తున్నాడు. దండరెట్టలమీద కడియాలున్నాయి. ఎదరొమ్ముమీద గుచ్చుకుంటున్న బాకును వీరుడు ఎడమచేత పట్టుకుని ఉన్నాడు. వీరుడు ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు తెలుస్తోందని కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు వివరించారు. ఈ వీరులలో మతం కోసం శరీరంలోని అంగాలను అర్పించేవారు. ముఖ్యంగా ఈ రకం వారు వీరశైవులలో ఎక్కువగా కనిపిస్తారు. 10, 11 శతాబ్దాలనాటి ఆహార్యంతో వీరుడు కనిపిస్తున్నాడని చెప్పారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు